*కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
*శ్రీకాకుళం, నవంబర్( విశాఖ పున్నమి ప్రతినిధి):* కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మనసును కలిచివేసిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. ఈ ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయానికి విచ్చేసిన యువనేత, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని పల్లా శ్రీనివాసరావు గారు కలసి, ఆయనతో పాటు కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, హోం మంత్రి శ్రీమతి అనిత గారు కలిసి కాశీబుగ్గకు పయనమయ్యారు. అనంతరం అక్కడికి చేరుకుని మృతి చెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించి, క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. దేవాలయం పూర్తిగా ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది. ఇది దేవాదాయశాఖ పరిధిలో లేదు. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నా ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర నిర్లక్ష్యం. రెండు వేల మంది కూడా సరిపోని ప్రాంగణంలో ఇరవై వేల మందిని అనుమతించడం నిర్వాహకుల వైఫల్యమే అని పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలను ఉద్దేశించి పల్లా శ్రీనివాసరావు గారు ఘాటుగా స్పందిస్తూ.. ఫేక్ పార్టీ వైసీపీకి ఇప్పుడు ఏమీ దొరకడం లేదు… వారి జీవితమే ఫేక్. గతంలో వివేకాను హత్య చేసి ‘గుండెపోటు’ అన్నారు. తర్వాత సునీత ఫిర్యాదుతో ‘గొడ్డలిపోటు’ అని ఒప్పుకున్నారు. ఆధారాలు చెరిపేసినవాళ్లకు రాజకీయాలు చేసే అర్హత ఉందా? నేరస్తులు రాజకీయ పార్టీ పెట్టి ఫేక్ ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమే అని విమర్శించారు. కర్నూలు బస్సు ప్రమాదంలోనూ, ఇప్పుడు కాశీబుగ్గ ఘటనలోనూ ఫేక్ ప్రచారమే వారి ఆయుధం అయింది. కానీ ప్రజలు ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలను నమ్మడం లేదు అని పల్లా గారు వ్యాఖ్యానించారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..కాశీబుగ్గ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తోంది. క్షతగాత్రులకు వైద్యసహాయం కల్పించేందుకు యంత్రాంగం వెంటనే స్పందించడం అభినందనీయమైన విషయం. ప్రైవేట్ దేవాలయం కావడంతో రద్దీ నియంత్రణలో లోపం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని పల్లా గారు తెలిపారు.


