ఖమ్మం మార్చి
( పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి )
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్.
ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు
కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు
స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.



