ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని, 5 కోట్ల ప్రజల ఆకాంక్ష .. అమరావతి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో గురువారం రాత్రి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు, పట్టణ ప్రజలతో సంబరాలను నిర్వహించారు. బాణా సంచా కాల్పులతో .. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో ప్రకాశం చౌక్ సెంటర్ అంతా మారుమ్రోగింది.
ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం రాజధాని అమరావతి అని, ఇది ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమన్నారు. అమరావతి ఇక అజేయం, అజరామరమని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి అని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, రైతుల త్యాగాలకు (33,000 ఎకరాల భూసమీకరణ) దక్కిన చారిత్రాత్మక విజయమని అన్నారు. వైసీపీ నాయకులు ఏదో చేస్తామంటే ఏమి మారాదని, శాశ్వత రాజధాని అమరావతి అని అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యురాలు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమరావత్ రాజధానిగా ఎన్నికవడం శుభ సూచకమని, జై అమరావతి అని అన్నారు. అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైందని, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం జై అమరావతి జై జై అమరావతి అంటూ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

