
ఆ…. తరం నెల్లూరు జిల్లా ముఖ్యమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా నెల్లూరుకు చెందిన ముగ్గురు ప్రముఖులకు అవకాశం లభించింది. రాష్ట్రస్థాయి అత్యున్నత పదవులను అలంకరించగలగడం నెల్లూరు జిల్లాకు గర్వకారణం. రెండు పదవులను అలంకరించిన ఏకైక వ్యక్తి బెజవాడ గోపాలరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా బెజవాడ గోపాలరెడ్డి, నేదురుమల్లి జనార్థనరెడ్డి ఎన్నికైనారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి, పశ్చిమబెంగాల్ గవర్నరుగా కె.వి. రఘునాథరెడ్డి పదవులనలంకరించారు. డా|| బెజవాడ గోపాలరెడ్డి (1907 – 1997) ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు కాగా, రెండవ ముఖ్యమంత్రిగా డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి 1955లో పదవిని స్వీకరించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు పదవిలో వున్నారు. (అటుతర్వాత నీలం సంజీవరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా వున్నారు.) నెల్లూరు సీమవాసులలో తొలి ముఖ్యమంత్రి. అప్పటి రాజధాని కర్నూలు పట్టణం. గోపాలరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం భూస్వాముల కుటుంబం నుంచి వచ్చిన వారు. ముఖ్యమంత్రి పదవి తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా ఐదేళ్లపాటు ఉన్నారు. అంతకు ముందే కేంద్రంలో మంత్రి పదవులు పొందారు. 1958లో రాజ్యసభకు ఎన్నికై 1963 వరకు నెహ్రూ మంత్రివర్గంలో రెవెన్యూ, ఆర్ధికశాఖ, సమాచార ప్రసారశాఖల మంత్రిగా పనిచేశారు. మచ్చలేని నాయకుడుగా పేరు ప్రతిష్ఠలు గడించారు. ఆయనలో హుందాతనం, రాజసం, ఠీవి ఉట్టిపడేవి. బహుభాషా కోవిదుడు. లలితకళలపై మక్కువ గలిగినవారు. రవీంద్రనాథ్‌ఠాగోర్ స్థాపించిన శాంతినికేతన్‌లో విద్య నభ్యసించారు. విశ్వకవి రవీంద్రుడు రచించిన ”గీతాంజలి” ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్రఠాగోర్, అభినవ ఠాగోర్‌గా ప్రశంసలందుకొన్నారు. మరెన్నో కవితలు, పద్యాలు వ్రాశారు. తన స్వీయ చరిత్రలో తాను నెల్లూరుకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాడిని మాత్రమే కాదు, ‘విశ్వ నరుడిని’ అని సగర్వంగా చెప్పుకొన్న విశాల హృదయుడు. రవీంద్రనాథ్ ఠాగోర్‌పై ఎంత గౌరవమంటే ఠాగోర్ జన్మదినం రోజున ఆర్యసమాజ్ పద్ధతిలో గోపాలరెడ్డి వివాహం చేసుకొన్నారు. ఆయన నివసించిన భవనానికి ‘శాంతి నికేతన్’ అని పేరు పెట్టుకొన్నారు. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యా గ్రహం చేసి జైలు కెళ్లారు. పలుసార్లు ఉద్యమాలలో పాల్గొని దాదాపు 18 నెలలపాటు జైలు జీవితం గడిపారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులు గాను, ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగాను సేవలందించారు. జ్ఞానపీఠ్ అవార్డు నిర్ణేతగా ఉన్నారు. 29 ఏళ్ళ ప్రాయంలోనే రాజగోపాలాచారి మంత్రి వర్గంలో స్థానం పొందారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు అందివచ్చినన్ని పదవులు రాష్ట్ర చరిత్రలో మరెవ్వరికి రాలేదు. రాజకీయాలు, సాహిత్యం రెండింటిలోను రాణించారు. 1997లో స్వర్గస్తులయ్యారు. గోపాలరెడ్డి బ్రతికి ఉన్న కాలంలోనే కళాకారుల సహాయనిధి ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఏటా పేద కళాకారులకు ఆర్థికసాయం అందుతుంది. ఇదిగాక ఆయన ఆశయం మేరకు సాహిత్య కళారంగాలలో విశిష్ట సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం అవార్డులందిస్తున్నారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి (1935 – 2014) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1990 డిసెం బరులో జనార్దనరెడ్డి పదవినలంకరించి రెండేళ్ల పాటు అందులో ఉన్నారు. నెల్లూరు జిల్లా స్వర్ణముఖీ తీరాన ఉన్న వాకాడులో జన్మించారు. ఉపాధ్యా యుడుగా జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రాజకీయవేత్త. రాజకీయాలను కాచి వడపోసిన వ్యక్తి. మొదటి నుంచి కాంగ్రెసువాది. ఆయన ఎప్పుడూ పార్టీలు మారలేదు. పదవి ఉన్నపుడు పొంగిపోలేదు. లేనపుడు క్రుంగిపోలేదు. కాంగ్రెసు అధిష్టానంతో సన్నిహిత సంబంధం కలిగిన వారు. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడుగా పేరు పొందారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన అంజయ్య, చెన్నారెడ్డి ప్రభుత్వాలలో రెవెన్యూ విద్యుత్‌శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. వీరు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పి.వి. నరసింహరావులకు సన్నిహితంగా ఉండే వారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిన తర్వాత, కాంగ్రెసు రెండుగా చీలి కాంగ్రెసు (ఐ), కాంగ్రెస్ (ఆర్)గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్య నాయకులు రెడ్డి కాంగ్రెసు పక్షం వహించినపుడు జనార్దనరెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన నిలిచారు. మొట్టమొదట 1970లో నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజక వర్గం నుండి ఎం.ఎల్.సి.గా పోటీచేసి ఓడినా, పి.వి. నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1972లో రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శాసనమండలికి ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వీరి హయాంలోనే రైతులకు పట్టాదారు పుస్తకాలిచ్చే పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1998లో బాపట్ల, 1999లో నర్సారావుపేట, 2004లో విశాఖపట్నం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికైనారు. నాలుగు చట్టసభలలో పనిచేసిన అరుదైన ఘనత వీరికి దక్కింది. 1988-89లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడుగా ఉన్నారు. 1989 వెంకటగిరి నుండి శాసన సభకు ఎన్నికయ్యారు వారి సతీమణి రాజ్యలక్ష్మి వెంకటగిరి అసెంబ్లీ నుండి రెండుసార్లు ఎన్నికై మంత్రిపదవి చేపట్టారు. వారి సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ కమిటి సభ్యులుగా కొంతకాలం వున్నారు. నెల్లూరులో ఆయన నివసిస్తున్న భవనానికి ‘స్వర్ణముఖి’ అని పేరు పెట్టుకొన్నారు. రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ జనార్దనరెడ్డి 2014 మే 9న కన్నుమూశారు.