కుస్తీ బరిలో బాల అకాడమీ దూకుడు!జిల్లా స్థాయిలో జయకేతనం… రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
నంద్యాల: క్రీడారంగంలో బాల అకాడమీ – సిల్వర్ ఓక్స్ హైస్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. నంద్యాల మున్సిపల్ హైస్కూల్ వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో బాల అకాడమీ విద్యార్థులు ఎస్.ఎం.డి. నాబిల్ (10వ తరగతి), సాయి శ్రీవిద్య (9వ తరగతి) అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. తమ అసాధారణ ఆటతీరుతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.ఈ నెల 10, 11, 12 తేదీల్లో పల్నాడు జిల్లా, కరెంపూడిలోని BZPH పాఠశాల వేదికగా నిర్వహించనున్న SGF AP U-17 రాష్ట్రస్థాయి కుస్తీ ఫ్రీ స్టైల్ పోటీల్లో నాబిల్, సాయి శ్రీవిద్య పాల్గొననున్నారు. జిల్లా స్థాయిలో సాధించిన విజయంతో పాఠశాలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.విద్యార్థుల విజయానికి వారి కఠోర సాధన, పట్టుదలతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ శివ అందించిన ప్రోత్సాహం, శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో దోహదపడ్డాయి. క్రీడల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు పాఠశాల యాజమాన్యం అందిస్తున్న సహకారం ప్రశంసనీయం.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాధవి లత, ప్రిన్సిపల్ రమేష్ సార్, కోఆర్డినేటర్ నాగమణి విద్యార్థులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయాలు సాధించి పాఠశాలకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే విజయం తప్పక వరిస్తుంది అనే విషయాన్ని నాబిల్, సాయి శ్రీవిద్య విజయాలు మరోసారి నిరూపించాయి. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ వీరిద్దరూ అద్భుత ప్రతిభ కనబరిచి బాల అకాడమీకి మరింత పేరు, గౌరవం తీసుకురావాలని పాఠశాల కుటుంబం ఆకాంక్షిస్తోంది.








