చిన్నారి ముద్దు మాటలతో అంగన్‌వాడీ టీచర్ నిర్లక్ష్యం బట్టబయలు
కలెక్టర్ ప్రశ్నలకు కుండబద్దలు కొట్టినట్లు సమాధానాలు.. చిన్నారి నిజాయితీకి బహుమతి.. టీచర్‌పై చర్యలకు ఆదేశం గంగారం, మండలం కోడిశెలబిట్ట గ్రామం నవంబర్ 26 (మహబూబాబాద్ జిల్లా): ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలు అంగన్‌వాడీ కేంద్రంలోని సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఐఏఎస్ అడిగిన ప్రశ్నలకు ఆ చిన్నారి ఏమాత్రం తడబడకుండా, జరిగిన విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంతో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణలోని లోపాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి నిజాయితీకి ముచ్చటపడిన కలెక్టర్ బహుమతి అందించగా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం గంగారం మండలం కొడిశాలమిట్ట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రం ఎప్పుడు తెరుస్తారు? టీచర్ ప్రతిరోజూ వస్తున్నారా? ఇప్పటివరకు ఏం పాఠాలు నేర్పించారు? అంటూ ప్రశ్నించారు. దీనికి చిన్నారి స్పందిస్తూ.. టీచర్ ఈరోజే వచ్చారని, అంగన్‌వాడీ కేంద్రం కూడా ఇప్పుడే తెరిచారని, ఇన్ని రోజులు టీచర్ రాలేదని చెప్పాడు. అంతేకాకుండా తనకు ఇప్పటివరకు ఏబీసీడీ, అ ఆ ఇ ఈ మాత్రమే వచ్చునని, టీచర్ అంతవరకే నేర్పించారని అమాయకంగా సమాధానమిచ్చాడు. కలెక్టర్ అడిగిన ప్రతి ప్రశ్నకు చిన్నారి నిజాయితీగా సమాధానాలు చెప్పడంతో అక్కడున్న అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. చిన్నారి మాటల్లోని నిజాయితీకి, ధైర్యానికి ముగ్ధురాలైన కలెక్టర్ అతడిని అభినందించి బహుమతి అందజేశారు. ఊహించని బహుమతి అందుకోవడంతో ఆ చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మరోవైపు చిన్నారి వెల్లడించిన విషయాలపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. అంగన్‌వాడీ కేంద్రానికి సిబ్బంది సక్రమంగా హాజరవుతున్నారా? చిన్నారులకు విధిగా పాఠాలు బోధిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్‌వాడీ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నారి నోట పలికిన నిజాలు.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకుంటే వారి విద్యాభివృద్ధి ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఈ ఘటనతో తెరపైకి వచ్చాయి. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ అవసరమని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.









