రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు
రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తిచేయాలి- మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 18, పున్నమి ప్రతినిధి : బాచుపల్లి – గండి మైసమ్మ వరకు 6 వరసల రోడ్డు, బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపు పై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చెల్స్ అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.