Saturday, 4 April 2026

Blog

విశాఖపట్నం

అనకాపల్లిలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ – కొత్త సబ్ స్టేషన్లకు మంత్రి గొట్టిపాటి శ్రీకారం

అనకాపల్లి జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ పరిధిలోని చౌడువాడ, కింతలిలో కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించారు. రూ.3.65 కోట్ల వ్యయంతో చౌడువాడలో, రూ.3.37 కోట్లతో కింతలిలో సబ్ స్టేషన్లు నిర్మాణం పూర్తయాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కొణతల, బండారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏపీఈపిడిసిఎల్ పరిధిలోని 11 జిల్లాలలో రూ.250 కోట్లతో మొత్తం 69 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రతీ జిల్లాకు కొత్తగా 10 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి స్థానికంగా విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 20 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి వినియోగదారుడు ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం విధించిన 40 పైసల ఎఫ్‌పిపిపి చార్జీలలో 13 పైసలు తగ్గించి వినియోగదారులకు నేరుగా లాభం చేకూర్చుతున్నామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రూ.35 వేల కోట్లతో 65 లక్షల మందికి ప్రతి నెలా పెన్షన్లు అందిస్తున్నామని, రూ.10 వేల కోట్లతో ‘తల్లికి వందనం’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నర్సీపట్నం, మాడుగులను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు.

విశాఖపట్నం

విశాఖలో సిఐటియు 18వ అఖిల భారత మహాసభ సన్నాహకాలు ఉత్సాహంగా

అఖిల భారత సిఐటియు 18వ మహాసభను పురస్కరించుకొని నిర్వహించబోయే శ్రామిక సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సమావేశాన్ని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు జి.రమణ అధ్యక్షతన నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి.నర్సింగరావు, మాజీ మేయర్ దాడి సత్యనారాయణ, సినీ దర్శకుడు యాద్ కుమార్, వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరవ ప్రకాశరావు, వంగపండు దుష్యంతు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు మంగరాజు, ఐఎన్టీయూసీ నాయకుడు నాగభూషణం, లీడర్ పత్రిక రమణమూర్తి, కేరళ కళా సమితి ఉపాధ్యక్షుడు పీకే జోస్ తదితరులు డంకా మ్రోగించి ఉత్సవాల సన్నాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ — నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్మిక హక్కులను హరించే విధంగా విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తూ, సహజ వనరులను పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. విశాఖలో జరుగనున్న మహాసభలు శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని సూచించారు. దాడి సత్యనారాయణ మాట్లాడుతూ — ఇంతటి మహా కార్యక్రమం విశాఖలో జరగడం నగర గౌరవాన్ని పెంచుతుందని, సిఐటియు పోరాటాలు కార్మిక హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఐఎన్టీయూసీ నాయకుడు నాగభూషణం మాట్లాడుతూ — సిఐటియు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు జరిపిందని, తాను కూడా కళారంగం ద్వారా సహకరిస్తానని తెలిపారు. సినీ దర్శకుడు యాద్ కుమార్ మాట్లాడుతూ — సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. నరవ ప్రకాశరావు మాట్లాడుతూ — విశాఖ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో చాటేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించాలని సూచించారు. వంగపండు దుష్యంతు మాట్లాడుతూ — కార్మిక సమస్యలపై ఎర్రజెండా నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రజా కళారూపాల ద్వారా ప్రతిబింబించాలని కోరారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు మంగరాజు మాట్లాడుతూ — ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల పై జరుగుతున్న దాడులను ప్రతిబింబించే పాటలు, వీధినాటకాలు, నిశ్చరూపకాలు ప్రదర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి కళాకారులను ఆహ్వానిస్తామని తెలిపారు. జనవరి 2న కామ్రేడ్ సఫ్దర్ హస్మి స్మారకంగా వీధి నాటకోత్సవాలు కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. నాటకరంగ దర్శకుడు చలసాని కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ — సుందరయ్య గారు సైకిల్‌పై తిరిగి పేదల పక్షాన పోరాడిన మహానేత అని, అటువంటి ఆలోచనల వారసత్వం సిఐటియు ద్వారా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.కె.రమాప్రభ, ఎం.చంటి, దండు నాగేశ్వరరావు, గౌరీశంకర్, వై.అప్పారావు, క్రితా కరుణి, లోకేష్, రమణమూర్తి, ఆర్.కె.ఎస్.వి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ సంస్కరణలు

▪️ *పంచాయతీ సెక్రటరీ పదవికి కొత్త పేరు: “పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (PDO)”* *13351 గ్రామపంచాయతీలను కొత్తగా 4 గ్రేడ్లుగా వర్గీకరించారు:* ▪️రూర్బన్ పంచాయతీలు – 359 ▪️గ్రేడ్-I – 3082 ▪️గ్రేడ్-II – 3163 ▪️గ్రేడ్-III – 6747 👉 ఇప్పటి వరకు ఉన్న 7244 క్లస్టర్లను రద్దు చేసి 13351 గ్రామపంచాయతీలను స్వతంత్ర యూనిట్‌ లుగా ప్రకటించారు. 👉 సిబ్బంది మూడు గ్రేడ్లలో పునర్విభజన: గ్రేడ్-I : ₹44,570 – ₹1,27,480 గ్రేడ్-II : ₹32,670 – ₹1,01,970 గ్రేడ్-III : ₹28,280 – ₹89,720. 👉 359 రూర్బన్ పంచాయతీల్లో గ్రేడ్1 పంచాయితీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా అప్ గ్రేడ్ చేశారు. (Deputy MPDO స్థాయి జీతశ్రేణితో). 👉 ప్రతి గ్రామపంచాయతీకి కొత్త సిబ్బంది నిర్మాణం. ▪️Sanitation Wing (శుభ్రత విభాగం) ▪️Water Supply Wing (నీటి సరఫరా) ▪️Country Planning Wing (గ్రామ ప్రణాళిక) ▪️Street Lighting & Engineering Wing (వీధి దీపాలు, ఇంజినీరింగ్) ▪️Revenue Wing (ఆదాయం & పన్ను వసూళ్లు). ▪️వీరి జీతాలు గ్రామపంచాయతీ జనరల్ ఫండ్‌ నుంచి చెల్లించాలి. 👉 IT విభాగం ఏర్పాటుకు నిర్ణయం: గ్రామ పంచాయతీల మొత్తం డిజిటలైజేషన్‌కి ప్రత్యేక వింగ్ ఏర్పాటు. 👉 అన్ని ఖాళీ PDO పోస్టులు 2025-26లో నింపాలని ఆదేశాలు.

విశాఖపట్నం

నేడు జెడ్పీ స్థాయీ సంఘ స‌మావేశాలు జిల్లా ప‌రిష‌త్ సీఈవో పి.నారాయ‌ణ‌మూర్తి

జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అధ్యక్షతన ఈనెల 6న ( గురువారం) ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం వరకు జ‌డ్పీ స్థాయీ సంఘ స‌మావేశాలు నిర్వ‌హించనున్న‌ట్లు జిల్లా ప‌రిష‌త్ సీఈవో పి.నారాయ‌ణ‌మూర్తి బుధవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జ‌డ్పీ ఛైర్ పర్శ‌న్ జె.సుభ‌ద్ర‌ అధ్య‌క్ష‌త‌న ఆమె ఛాంబ‌ర్ స‌మీపంలోని వి.సి.హాలులో అలాగే జ‌డ్పీ స‌మావేశ మందిరంలో 1 నుంచి 7 వ‌ర‌కు గ‌ల స్థాయీ సంఘ స‌మావేశాలు వేర్వేరుగా ఉద‌యం 10.00 నుంచి 12.30గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు.ఉద‌యం 10.00 గంట‌ల‌కు 2,వ స్థాయీ సంఘ సమావేశం, ఉదయం 10.30గంటలకు 3వ స్థాయీ సంఘ సమావేశం, 11:00 గంట‌ల‌కు 4వ స్థాయి సంఘ సమావేశం, 11:30 గంటలకు 5వ స్థాయీ సంఘ సమావేశం, 12.30 గంట‌ల‌కు, 6వ స్థాయి సంఘ సమావేశం 1,7వ సాయి సంఘ సమావేశములు 12:00 జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. సంబంధించిన ప్రగతి నివేదికలతో అధికారులు స‌మావేశాల‌కు హాజ‌రుకావాల‌ని, ప్రాదేశిక నియోజ‌క‌వ‌ర్గ స‌భ్యులు, ఎంపీపీలు, హాజరుకావాలని ప్ర‌క‌ట‌న ద్వారా కోరారు.

విశాఖపట్నం

ప్రజలు ఆరోగ్యంగా… ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం డిజిటల్ విధానంలో వైద్య సేవలను అందరికీ చేరువ చేస్తున్నాం రూ. 2 కోట్లతో కేజీహెచ్‌లో డయాలసిస్ యూనిట్‌ను పునఃప్రారంభించిన మంత్రి

ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను సాంకేతిక ఆధారిత (డిజిటల్) విధానంలో ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు. సీఎస్‌ఆర్ కింద ఎన్టీపీసీ సంస్థ రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కింగ్ జార్జ్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్‌ను మంత్రి బుధవారం పునఃప్రారంభించారు. అనంతరం యూనిట్‌లోని సదుపాయాలను పరిశీలించి, రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, అందులో భాగంగా రూ.25 లక్షల విలువైన సార్వత్రిక ఆరోగ్య బీమా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. కుప్పంలో ‘సంజీవని’ పేరుతో పైలట్ ప్రాజెక్టు అమలవుతోందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ డిజిటల్ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ప్రస్తుతం 13 ఉపయూనిట్లు సేవలందిస్తున్నాయని, ఎన్టీపీసీ సాయంతో మరిన్ని 10 కొత్త యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సమగ్ర వైద్య సదుపాయాలు కల్పించామని, పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్ డా. రవిరాజు, ప్రిన్సిపాల్ డా. కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ నిర్వాహకుడు బీవీ రమణ, సూపరింటెండెంట్ డా. ఐ.వాణి, ఆర్ఎంవో డా. శ్రీహరి, నెఫ్రాలజీ విభాగాధిపతి డా. రత్నప్రభ, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా దీపోత్సవం భీమిలి ఎమ్మెల్యే గంటా

అన్ని శాఖల సమన్వయంతో ఈనెల 19 న జరగనున్న అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దీపోత్సవ నిర్వహణ సన్నద్ధతపై బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ భక్తులు ఎంత ఎక్కువ సంఖ్యలో వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భక్తులకు మంచి అనుభూతి కలిగేలా దీపోత్సవ నిర్వహణ ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వ హామీల్లో భాగంగా ఉచిత బస్సు సదుపాయం కల్పించిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి దీపోత్సవానికి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆలయానికి ఘాట్ రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం.. దెబ్బతిన్న ఆలయ కలశాన్ని పున ప్రతిష్ట చేయడం.. ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభస్వామి వారి దీపోత్సవ పోస్టర్ ను గంటా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సంగీత్ మాధుర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ, ఏసీపీ అప్పలరాజు, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, ఈఓ రాజు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, గాడు వెంకటప్పడు, రామరాజు, మొకర అప్పలనాయుడు, తాట్రాజు అప్పారావు, కాళ్ల సత్యనారాయణ, ఎంపీపీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శ*

*ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శ* *డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి డా. స్వామి ప్రత్యేక శ్రద్ధ* *ఇప్పటి వరకు తీవ్ర అనారోగ్యానికి గురైన 37 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన మంత్రి డా.స్వామి* విశాఖ, నవంబర్,పున్నమి ప్రతినిధి:- తీవ్ర అనారోగ్యానికి గురై విశాఖలోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి బోనెల చరణ్ ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధి ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి చరణ్ ని మంత్రి స్వామి ప్రత్యేక చొరవ తీసుకుని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నేడు విద్యార్థిని పరామర్శించారు. డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి డా. స్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ విద్యా సంవత్సరంలో తీవ్ర అనారోగ్యానికి గురైన 37 మందికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక చొరవతో వైద్యం చేయించి వారి ప్రాణాలు కాపాడారు.

విశాఖపట్నం

రాష్ట్రంలో 69 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం – మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లాలో 10 సబ్‌స్టేషన్లు – అదనంగా మరొకటి మంజూరు

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలం చౌడువాడ, మాడుగుల మండలం కింతలి ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రాలు పలు అభివృద్ధి పథకాలను ఆయన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి లతో కలిసి ప్రారంభించారు. చౌడువాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ — జిల్లాకు 10 సబ్‌స్టేషన్లు మంజూరు చేసినట్లు, అందులో మాడుగుల నియోజకవర్గానికి రెండు సబ్‌స్టేషన్లు, అదనంగా మరొక సబ్‌స్టేషన్ కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో రూ.250 కోట్లతో 69 సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 20 వేల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఇళ్లలో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రూ.3.65 కోట్లు వ్యయంతో నిర్మించిన చౌడువాడ ఉపకేంద్రం ద్వారా కె.కోటపాడు మండలంలోని 9 గ్రామాలు చోడవరం మండలంలోని పలు ప్రాంతాలు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో లబ్ధి పొందనున్నాయని తెలిపారు. దీని ద్వారా తాత్కాలిక విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు. గత ప్రభుత్వం విధించిన ఎఫ్‌పీపీ చార్జీలలో 40 పైసలలో 13 పైసలు తగ్గించి, ఆర్థిక ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, రూ.35 వేల కోట్లతో 65 లక్షల మందికి పెన్షన్లు, రూ.10 వేల కోట్లతో తల్లికి వందనం పథకం కొనసాగుతోందని వివరించారు. సీఎం రమేష్ మాట్లాడుతూ జిల్లాను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, మాడుగుల నియోజకవర్గంలో 2 వేల ఎకరాలను పరిశ్రమల స్థాపనకు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సుమారు 6 వేల యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, విద్యా అభివృద్ధికి యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన 10 సబ్‌స్టేషన్లలో ఐదు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. పరిశ్రమలతో పాటు వ్యవసాయం, గిరిజన ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఉత్తమ పంచాయతీ అవార్డు సాధించిన చౌడువాడలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని, దీని ద్వారా విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రెండు సబ్‌స్టేషన్లు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేవరాపల్లి ప్రాంతానికి మరో సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, నియోజకవర్గంలో పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఎంఎల్ఏ కె.ఎస్‌.ఎన్‌.రాజు, ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.ప్రసాద్, గ్రామ సర్పంచ్ దాడి ఏరుకు నాయుడు, డీఈలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాష్ట్ర భ‌విష్య‌త్తుకు త‌ల‌మానికంగా భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏయూలో జ‌రుగుతున్న ఏర్పాట్లను ప‌రిశీలించిన‌ ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ‌బాల వీరాంజ‌నేయ స్వామి 9.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు రాక‌తో పాటు, 2.7 ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డి

ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖ‌పట్ట‌ణం వేదిక‌గా జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భ‌విష్య‌త్తుకు త‌ల‌మానికం కానుంద‌ని, ఈ మ‌హా కార్యాన్ని దిగ్విజ‌యం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అహర్నిశల కృషి చేస్తోంద‌ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఇత‌ర‌ కేబినెట్ మంత్రులు ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించి పారిశ్రామిక వేత్త‌ల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను ఆహ్వానించార‌ని గుర్తు చేశారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, జిల్లా క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి బుధ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో మీడియాతో ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ప్ర‌పంచ స్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సును దిగ్విజ‌యం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని పేర్కొన్నారు. సుమారు 40 పైచిలుకు దేశాల నుంచి వంద‌ల సంఖ్య‌లో అతిథులు, వివిద కంపెనీల ప్ర‌తినిధులు విచ్చేస్తున్నార‌ని తెలిపారు. స‌ద‌స్సు నిర్వ‌హించ‌టం ద్వారా రాష్ట్రానికి రూ.9.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని మంత్రి స్వామి పేర్కొన్నారు. త‌ద్వారా 7.5 లక్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగావ‌కాలు వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్ర‌కారం 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న‌లో భాగంగా ఇప్ప‌టికే 10 లక్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించే ప్ర‌క్రియ‌ల‌ను పూర్తి చేశామ‌ని చెప్పారు. దేశ‌, విదేశాల నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ‌, అధికార ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో 410 ఒప్పందాలు జ‌రుగుతాయ‌ని, 2.7 ల‌క్ష‌ల కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న ప్రాజెక్టులు శంకుస్థాప‌న‌లు కూడా జరుగుతాయ‌ని మంత్రి వివ‌రించారు. విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని పూర్తిస్థాయి ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి ఉద్ఘాటించారు. ఏయూలో జ‌రుగుతున్న ఏర్పాట్లు, వేదిక‌లు, ఇత‌ర అంశాలను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ మంత్రికి, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మ్యాప్ సహాయంతో వివ‌రించారు. ప‌ర్య‌ట‌న‌లో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జిల్లా క‌లెక్ట‌ర్, సీఐఐ ప్ర‌తినిధి మౌళి, ఇత‌ర అధికారులు ఉన్నారు.

విశాఖపట్నం

నగరంలో 22 ఏ సమస్యని పరిష్కరించండి ప్రియాంక దండి

కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి వి ఏం ఆర్ డి ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ని బుధవారం కలిసి నగరంలో చాలా మంది స్థలాలు 22ఏ లో పెట్టడం వల్ల అమ్ముకోవడానికి, బ్యాంక్ ఋణం తీసుకోవడానికి లేదా నిర్మాణాలు చేపట్టడానికి కుదరక ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య పై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.