మనలను కరిచిన కుక్కను ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి.

0
589

మనలను కరిచిన కుక్కను ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి.
మనల్ని కరిచిన కుక్కను ఏమి చేయాలి?
చేసేది ఏముంది, కొట్టి చంపి పారేయాలి అన్నది ఎక్కువమంది చెప్పే సమాధానం.ఇది తప్పు. ఆ కుక్కను కొట్టకూడదు. చంపకూడదు. బ్రతికించు కోవాలి. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క పది రోజులు బ్రతికుంటే మనకు దానివలన రేబీస్‌ ‌వ్యాధి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి .ఎంత జాగ్రత్తగా అంటే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి చూసుకున్నంత జాగ్రత్తగా. రేబిస్‌ ‌వ్యాధి మనకు రావాలంటే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ ‌వ్యాధి ఉండి దాని లాలాజలంలో వైరస్‌ ఉం‌డాలి. అలా లాలాజలంలో వైరస్‌ ఉన్న కుక్క వారం లోపల చనిపోవలసిందే. రేబిస్‌ ‌వ్యాధి వచ్చి వారానికి మించి బ్రతికిన జంతువు ఇంతవరకు లేదు. మనల్ని కరిచిన కుక్క వారానికి మించి బతికింది అంటే దానికి రేబీస్‌ ‌లేదు .మరి దానికే లేనప్పుడు అది కరవడం ద్వారా మనకు రేబీస్‌ ‌వచ్చే అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికే మనల్ని కరిచిన కుక్కని పదిరోజులపాటు గమనించుకోవాలి.
కుక్క కాటు గాయాన్ని ఏం చేయాలి?
వీలైనంత త్వరగా గాయాన్ని నీళ్ళతో కడగాలి. వీలైతే సబ్బుతో కడగడం మంచిది. గాయాన్ని పైపైన కడగడం కాదు లోతుగా కడగాలి. అందుకే కుళాయి కింద గాయ మైన భాగాన్ని ఉంచి గాయం లోపలకు నీరు పోయే విధంగా కడగాలి. అప్పుడే గాయం లోపల ఉన్న రేబిస్‌ ‌కారక వైరస్‌ ‌పూర్తిగా తొలగిపోతుంది. కరచిన వెంటనే కుళాయి అందుబాటులో లేనప్పుడు మగ్గులో నీరు తీసుకుని ఎత్తులో నుంచి గాయం మీద పడేటట్టుగా కడగడం మంచిది. ఇలా కనీసం పది సార్లు కడగాలి.ఇలా వెంటనే గాయాన్ని కడగ గలిగితే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ ఉన్నా దానివలన మనకు వచ్చే అవకాశం దరిదాపుగా లేనట్టే.
రేబిస్‌ ‌వ్యాధి సోకి, బ్రతికిన జీవి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వ్యాధికి ఇంతవరకు వైద్యం కనుగొనబడలేదు. ఈ వ్యాధి సోకితే వారంరోజుల్లో చనిపోవలసిందే . ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు 1885 సంవత్సరంలోనే లూయిస్‌ ‌పాశ్చర్‌ అనే మహనీయుడు కుక్క కాటుకు టీకాను కనుగొన్నాడు. అంటే 134 సంవత్సరాల క్రితం ఈ రేబిస్‌ ‌వ్యాధి కి టీకా అనుకొన్నపటికీ వ్యాధి నివారణ మాత్రం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 వేల మంది రేబీస్‌ ‌వ్యాధితో చనిపోతున్నారు ఇందులో 20 వేల మంది మన దేశంలోని వారే చనిపోతున్నారు. ఈ రేబిస్‌ ‌వ్యాధి సంక్రమించేది కుక్క కాటు ద్వారా మాత్రమే కాదు.నక్క ,పిల్లి,కోతి, గబ్బిలం లాంటి జంతువులు కరవడం ద్వారా కూడా సంక్రమించ వచ్ఛు.భారత దేశములో 98% మంది లో రేబీస్‌ ‌వ్యాధికి కారణం కుక్క కాటే.

రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ఎలా వేయించుకోవాలి?
కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారని గతంలో ఉన్నటువంటి వైద్య సూత్రం. ఇప్పుడు బొడ్డుచుట్టూ వేసే టీకా అనేక దేశాల్లో రద్దు చేయబడింది. 2004నుంచి మన దేశంలో కూడా రద్దు చేయబడింది. ఇప్పుడు కండలోకి వేసే టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ఐదు విడతలుగా వేయించుకోవాలి. మొదటి డోసు కరిచిన వెంటనే, రెండవ డోసు మూడవరోజు, మూడవ డోసు ఏడవ రోజు, నాలుగవ డోసు 28వ రోజు. (0-3-7-14-28). ఈ 5 విడుదల టీకా ఖర్చు సుమారు 2000 రూపాయలు అవుతుంది.ఈ ఖర్చును పేదలు భరించడం కష్టం. ఖర్చును తగ్గించడానికి పరిశోధనలు జరిపి ప్రస్తుతం చర్మంలోకి వేసే టీకాను కనుగొన్నారు. ఈ టీకాను నాలుగు విడతలుగా వేయించుకోవాలి (0-3-7-28) దీని మొత్తం ఖర్చు సుమారు 400 రూపాయలు..

ఈ టీకాను ఎప్పుడు వేయించుకోవాలి?
కరిచిన వెంటనే వీలైనంత త్వరగా టీకా వేయించుకోవడం మంచిది. మనలను కరిచిన కుక్క మంచిదో, పిచ్చిదో మనం గుర్తించడం కష్టం. మొదటి మరియు రెండవ డోసును వేయించుకుని, మనల్ని కరిచిన కుక్కను గమనించడం సాధ్యం కాకపోయినా, కుక్క చనిపోయినా ఏడవ రోజు వేయించుకోవాల్సిన మూడవ డోసును తప్పక వేయించుకోవాలి. కుక్క బ్రతికుంటే మిగిలిన డోసులను వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ జాగ్రత్తలు కుక్క కరిచినప్పుడే కాదు, పిల్లి, కోతి, నక్క, గబ్బిలం, గాడిద, గుర్రం ఇలాంటి జంతువులు కరిచినప్పుడు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్‌ ‌యం.వి.రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు,
ప్రజారోగ్య వేదిక (ఆంధప్రదేశ్‌)
‌డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రి,
నెల్లూరు.

0
0