SpSR నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమంలో మొత్తం 161 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు. ప్రజా సమస్యల పట్ల పోలీసు అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతతో వ్యవహరించి, అందిన పిటీషన్లను త్వరితగతిన పరిశీలించి చట్టపరంగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.
కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ వివాదాలు, మోసపూరిత వ్యవహారాలు, అదనపు కట్న వేధింపులు, ఆర్థిక మోసాలు వంటి అంశాలు ఉన్నాయి. ముత్తుకూరు, కోట, చిల్లకూరు, తోటపల్లి గూడూరు, దర్గామిట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కొన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.పి సూచించారు.
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎస్.పి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి (అడ్మిన్) CH. సౌజన్య, ఎస్‌బి డీఎస్పీ శ్రీనివాసరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ సత్యనారాయణ, డీసీఆర్‌బీ సీఐ రామారావు, కంట్రోల్ రూమ్ సీఐ భక్తవత్సల్ రెడ్డి, ఎస్‌బి-2 సీఐ శ్రీనివాస రెడ్డి మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.



