*అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
అంతర్గాం, జులై 17, పున్నమి ప్రతినిధి: పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అంతర్గాం మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పోట్యాల గ్రామంలోని ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, పాఠశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. పాఠశాలల్లోని పిల్లలకు విష జ్వరాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాల పాటు ఎటువంటి అవసరాలు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని, వాటిని వెను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మద్దిరాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారం అధికారులు అందించాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అంతర్గాం ఎంపీడీఓ వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, హౌసింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీ రాజ్ డీఈ అప్పల నాయుడు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.