
*జులై 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఎంబీసి అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం*
*_పెద్దపల్లి జిల్లా బీసి అభివృద్ధి అధికారి జే.రంగారెడ్డి_*
పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: ఈ నెల 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఆసక్తి, అర్హత గల ఎంబీసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతీ యువకుల కు వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమం 4 రోజుల పాటు హైదరాబాద్ లో అందించడం జరుగుతుందని అన్నారు.
శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజన సదుపాయం, టీఏ, వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల వయసు లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలని, ఎంబిసి 36 కులాల వారికి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం అందుతుందని, వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు ఉండాలని అన్నారు.
ఆసక్తి, అర్హత కల అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 21 లోపు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొని, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లతో దరఖాస్తు జత చేసి పెద్దపల్లి కలెక్టరేట్ లో ఉన్న బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జూలై 22 లోపు సమర్పించాలని, నిరుద్యోగ ఎంబీసీ యువతీ యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే. రంగారెడ్డి పేర్కొన్నారు.