2 సం।।లోపు పిల్లలకు టి.వి.చూపించకండి –
2 గం।।లకు మించి పెద్దలు టి.వి.చూడకండి
పిల్లలు, పెద్దలు, ఓ టి.వి. ఇవే నేడు ఎక్కడ, ఏ కుటుంబంలో చూసినా కనిపించే దృశ్యాలు. పిల్లలు కార్టూన్లు, వీడియో గేమ్స్‌లో తలమునకలై పోతుంటే పెద్దలు వీళ్ళు టి.వి.ఎప్పుడు వదులుతారా? సీరియల్స్ వచ్చే టైమ్ అయిందని తహతహలాడుతుంటారు. ఒకరికి నచ్చిన ఛానల్ మరొకరికి నచ్చదు. ఇంట్లో పిల్లల్లో గొడవ, పిల్లలు, పెద్దల మధ్య గొడవ, సమయం దొరికి నపుడు ఇంటిల్లిపాది హాయిగా కథలు కబుర్లు చెప్పుకునే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు తీరిక కాలమంతా టీవీ కాలమే. పిల్లలకు శారీరక ‘వ్యాయామం’ నిచ్చే సాంప్రదాయపు ఆటలకు స్వస్తి పలికి వీడియో గేమ్‌లకు బానిసలైపోయి చెడిపోతున్నారు. మనవాళ్ళు టి.వి.లో బొమ్మలు చూపిస్తూ పిల్లలు బోసినవ్వులు రువ్వుతుంటే అవి చూసి మురిసిపోతుంటారు. రెండు సంవత్సరాల లోపు పిల్లలు టి.వి. చూసినందువలన మెదడు అభి వృద్ధిలో పెరుగుదల తగ్గిపోతుందని ఇటీవల ఒక సర్వేలో ‘‘అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్’’ తెలిపింది. అంతేనా! 2 సం।। పై బడిన పిల్లలు, పెద్దలు కూడా రెండు గంటలకు మించి టీవీ చూడకూడదని హెచ్చరించింది.
టి.వి.చూడడం వలన కొన్ని లాభాలు ఉన్నా ఎక్కువ మోతాదులో నష్టాలే ఎక్కువ. అందుకే దీనిని ‘ఇడియట్ బాక్స్’ అని కూడా అంటారు. కొంత జ్ఞానాన్ని, వినోదాన్ని పంచినా సోమరితనము, స్థూలకాయమూ లాంటి శారీరక రుగ్మతలు స్థూలకాయం వలన బీపీ, కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ మూలాన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతే కాదు టివిల్లో కనిపించే కుట్ర, కుతంత్రాలు, నేరాలు – ఘోరాలు, హత్యలు-అత్యాచారాలు లాంటి జుగుప్సాకరమైన దృశ్యాలు చూడడం వలన క్రమశిక్షణ లోపించి నేరప్రవృత్తి పెరిగి యువత పెడధోరణులు పట్టే అవకాశం ఎక్కువ. అందువల్ల 2 సం।।లోపు పిల్లలను అసలు టి.వి.ని చూడనివ్వ కండి. పెద్దలు కూడా 2 గం।।లకు మించి టి.వి.చూడకండి.
డా।। ఎం.వి.రమణయ్య,
నెల్లూరు.
0 Comments
Chennuri Sudarshan
January 21, 2021మీరు అన్నది వాస్తవం సర్. ప్రతీ రంగంలోని మంచి చెడు రెండు ఉంటాయి.
మంచిని పెంచే హద్దు దాటితే ప్రమాదమే.
-చెన్నూరి సుదర్శన్