

శ్రీకాకుళం, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి)మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో ‘మేమోగ్రామ్’ స్క్రీనింగ్ పరీక్ష కీలకమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి సింధూర అన్నారు.మంగళవారం మునసబుపేట గాయత్రీ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల్లో 28 శాతం మంది బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులేనని తెలిపారు. ప్రతి మహిళా సంవత్సరానికి ఒకసారి మేమోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందితే, క్యాన్సర్‌ను జయించడం సాధ్యమని పేర్కొన్నారు.విశిష్ట అతిథి లయన్ డా. బగాది శ్రావ్య మాట్లాడుతూ, బ్రెస్ట్‌లో గడ్డలు, స్రావాలు, నొప్పి వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తాజా కూరగాయలు, పండ్లు, ఇంటి ఆహారం తీసుకోవడం శ్రేయస్కరమని చెప్పారు.కళాశాల ప్రిన్సిపాల్ కెవి. సత్యన్నారాయణ మాట్లాడుతూ, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్మూలనకు సంపూర్ణ అవగాహన అవసరమని, విద్యార్థినులు తమ కుటుంబం, గ్రామ మహిళలకు మేమోగ్రామ్ పరీక్ష ప్రాముఖ్యతను వివరించాలని కోరారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్షిప్ ఛైర్పర్సన్ ఎన్. రమ్య, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు చరణ్, ఇతర సభ్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం డా. సింధూర, డా. శ్రావ్యలకు సత్కారం అందించారు.

