*పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి*
మంచిర్యాల, జులై 26, పున్నమి ప్రతినిధి: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ ను బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి, నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయనీ, అలాగే దేశంలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ, బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేరో బీసీ సమాజానికి చెప్పాలని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా, బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం బాధాకరం అని అసహనం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని, రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారనీ, దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో, వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే, ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకటయ్య, సీనియర్ నాయకుడు కర్రె లచ్చన్న, జిల్లా కార్యదర్శి శాఖపురి భీం సేన్, నాయకులు అంకం సతీష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.