పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ప్రత్యేక ప్రతి నిధి)
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనను గాడిలో పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా ఖాళీగా ఉన్న సహకార, చేనేత శాఖల్లో 101 పోస్టులను భర్తీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో సహకార శాఖలో 63 మంది సహాయ రిజిస్ట్రార్లు (అసిస్టెంట్ రిజిస్ట్రార్లు), చేనేత శాఖలో 38 మంది సహాయ అభివృద్ధి అధికారులు (ఏడీఓలు) ఉన్నారు. గ్రూప్-2 పరీక్షల ద్వారా ఎంపికైన ఈ అధికారులు త్వరలోనే విధుల్లో చేరనున్నారు.
సహకార శాఖలో క్షేత్రస్థాయిలో సహకార సంఘాల నిర్వహణ, నిధుల వినియోగం, ఆడిటింగ్ వంటి బాధ్యతలు చూసే పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉండటం వల్ల పనితీరు మందకొడిగా మారింది. ఉన్నతాధికారులపై అదనపు పనిభారం పెరగడంతో పలు పథకాల అమలులో జాప్యం ఏర్పడింది. తాజా నియామకాలతో ఈ లోటు పూడ్చబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక చేనేత, జౌళి శాఖలో కూడా చాలా కాలంగా సిబ్బంది కొరతతో పథకాల అమలు కష్టంగా మారింది. ముఖ్యంగా చేనేత రుణమాఫీ, జౌళి ప్రోత్సాహకాలు వంటి పథకాల అమలులో జాప్యం ఏర్పడింది. కొత్త ఏడీఓల నియామకంతో ఈ సమస్యలు తీరనుండగా, చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు మరింత వేగంగా చేరనున్నాయి.
ఈ 101 పోస్టుల భర్తీతో రెండు శాఖల్లో క్షేత్రస్థాయి పరిపాలన బలపడనుందని, ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సహకార శాఖలో ఇంకా ఖాళీగా ఉన్న 23 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేసే అవకాశముందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, ఈ నియామకాలతో సహకార, చేనేత రంగాల పనితీరు మెరుగుపడే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది


