– పౌల్ట్రీ సప్లయర్ ఇంటి ముందు రైతుల దండయాత్ర!
కామారెడ్డి, 28 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లాలో పౌల్ట్రీ రైతులను నట్టేట ముంచాడు. కోడి కత్తులు కాదు, కోట్లాది ఆశలు! రైతుల కష్టార్జితాన్ని మింగేసి, అప్పుల ఊబిలోకి తోసిన ఓ పౌల్ట్రీ వ్యాపారి ఇంటి ముందు నేడు అసలు ‘మాస్’ సినిమా కనిపించింది! కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం అన్నారం గ్రామం ఉద్రిక్తతతో అట్టుడికిపోయింది. రైతులను నుంచి కోళ్లను అప్పుగా తీసుకుని, కంపెనీల నుంచి డబ్బులు వచ్చినా కక్కకుండా తిప్పుకుంటున్న సల్మాన్ అనే పౌల్ట్రీ సప్లయర్ ఇంటి ముందు బాధిత అన్నదాతలు ఆందోళన దిశగా కదం తొక్కారు. దొంగ-పోలీస్ ఆటలా మారిన వ్యాపా రం! వ్యాపారంలో భాగస్వాములైన భూంపల్లి గ్రామానికి చెందిన సాజిద్ పరిస్థితి మరింత దయనీయం. రైతుల నుంచి కోళ్లు తీసుకుని సల్మాన్‌కు అమ్మడం, ఆ డబ్బే చివరకు రైతుల చేతికి అందడం ఈ చైన్ సిస్టమ్. కానీ కొద్ది రోజులుగా, కంపెనీ నుంచి వచ్చిన సొమ్మును గుంజుకుంటున్న సల్మాన్, దళారి అయిన సాజిద్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదు. దీంతో కోళ్లు ఇచ్చిన సుమారు 20 మంది రైతులకు దాదాపు ₹34 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. డబ్బుల కోసం రైతులు సాజిద్ ఇంటికి క్యూ కట్టడంతో పరిస్థితి చేయి దాటింది.
కారు ఎక్కించిన కిరాతకం!
తాను పడుతున్న ఇబ్బందులు పడలేక, సల్మాన్‌ను నిలదీసేందుకు ఇటీవల వెళ్లిన సాజిద్‌కు దిగ్భ్రాం తికర అనుభవం ఎదురైంది. “డబ్బులు ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకో!” అంటూ బెది రించడమే కాక… సాజిద్‌పై నుంచే కారు తీసుకెళ్లి అమానుషంగా గాయపరిచాడని బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
రైతుల రక్షణ కవచం.. నేరుగా సల్మాన్ అడ్డాపైకే!
పదిహేను రోజులుగా కామారెడ్డిలోనే ఉండి, రైతుల ఒత్తిడి తట్టుకోలేక… ఒక్కడిని వెళ్తే సల్మాన్ మళ్లీ ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమోనన్న భయంతో సాజిద్ ఏకంగా ఆ 20 మంది రైతులతో కలిసి అన్నారంలోని సల్మాన్ ఇంటికే వచ్చేశాడు. “మా డబ్బివ్వు… లేదంటే ఇక్కడి నుంచి కదలం!” అంటూ రైతు దండు సల్మాన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. రైతుల ఆవేశం, కష్టార్జితాన్ని కబళించిన కోపంతో… అన్నారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌల్ట్రీ వ్యాపారి సల్మాన్ ఇప్పుడు రైతుల ఉగ్రరూపాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి!


