ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
పోటీ ప్రపంచంలో
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని యస్.బి.ఐ.టి కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ అన్నారు. సోమవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ప్రపంచ గతిని మార్చగల శక్తి తరగతి గది నుంచే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. నేటి యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యక్తిగత అలవాట్లలో మార్పులు, క్రమశిక్షణ ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “క్లాస్‌రూమ్ టు బోర్డ్‌రూమ్” అనే అంశంపై విద్యార్థులకు జీవిత విలువలు, వ్యక్తిగత క్రమశిక్షణపై అవగాహన కల్పించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. తరగతి గదులు జ్ఞానాన్ని అందిస్తాయని, అయితే ప్రపంచం ఆ జ్ఞానానికి పరీక్ష పెడుతుందని అన్నారు.
విద్యా వ్యవస్థ కేవలం పరీక్షలు, గ్రేడులు, డిగ్రీలకే పరిమితం కాకుండా, సవాళ్లను ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని కూడా అందించాలనే అభిప్రాయాన్ని కళాశాల వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథి గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ బోర్డ్‌రూమ్ అనేది కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్రంగా అభివర్ణించారు. తరగతి గదిలో తప్పులు జరిగే అవకాశం ఉన్నా, బోర్డ్‌రూమ్‌లో తీసుకునే తప్పు నిర్ణయాలు వ్యవస్థలపై, ఉద్యోగులపై, కుటుంబాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా॥ జి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ తరగతి గది, బోర్డ్‌రూమ్ మధ్య టీమ్‌వర్క్ అనే సామాన్యత ఉందన్నారు. విద్యార్థులు ప్రాజెక్టులు, వర్క్‌షాప్‌లలో కలిసి పనిచేసినట్లే భవిష్యత్తులో సమిష్టి పనితీరు అలవర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి గంపా నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



