వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో నందిగామలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య రైతులు, రైతు నేతలు, కూటమి నాయకులతో కలిసి బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ఈ ప్రాంత రైతులకు చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. పథకం మరమ్మత్తుల కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ పథకంపై నిరంతర పోరాటం చేశామని, ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనంతరం రెండవ రోజే ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. అలాగే విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి సమస్యను వివరించినట్లు చెప్పారు. ముప్పాళ్ల పి–4 కార్యక్రమంలోనూ రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
గత ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొన్న కష్టాలు తనను కలచివేశాయని, నేడు రైతన్న కళ్లలో ఆనందం చూడటం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు.
త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 17 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోటా వీరబాబు, డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, నీటి సంఘాల ప్రతినిధులు, రైతు నేతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


