*విశాఖ తూర్పులో రూ. 62 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం*
*ఘనంగా శంఖుస్థాపన చేసిన ఎంపి భరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి*
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-*
*కేంద్ర నిధుల సద్వినియోగంతోనే అభివృద్ధి: ప్రభుత్వ విప్ చిరంజీవిరావు*
*విశాఖ పార్లమెంట్ పరిధికి మూడు హాస్టళ్లు మంజూరు*
గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, రూ. 62 కోట్ల SASCI నిధులతో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ముడసర్లోవలో నిర్మించనున్న ‘వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్’ భవన సముదాయానికి శంఖుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపి శ్రీ ఎం.శ్రీభరత్, ప్రభుత్వ విప్ శ్రీ వేపాడ చిరంజీవిరావు, తూర్పు ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
*కేంద్ర నిధులు – చంద్రబాబు సమర్థత*: ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పాలన వల్ల, కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు గాడిన పడ్డాయని అన్నారు.
*విశాఖకు దక్కిన సింహభాగం:* చంద్రబాబు గారి కృషితో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 5 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు మంజూరు కాగా, అందులో మూడు కేవలం విశాఖ పార్లమెంట్ పరిధిలోకే రావడం విశేషమని చిరంజీవిరావు తెలిపారు. ఎంపి శ్రీభరత్ చొరవతో విశాఖ తూర్పు, భీమిలి, గాజువాక ప్రాంతాలకు వీటిని కేటాయించినట్లు చెప్పారు. ముఖ్యంగా ముడసర్లోవలో ఈ హాస్టల్ ఏర్పాటు వెనుక స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పట్టుదల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఆయనకున్న తపన దాగి ఉన్నాయని కొనియాడారు.
*అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణం:* దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో, 25 వేల చదరపు అడుగుల వైశాల్యంతో, ఐదు అంతస్తుల్లో ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు చేసే యువతులకు అత్యంత భద్రత, రక్షణ కల్పిస్తూనే, అందుబాటు ధరల్లో వసతి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా, పారిశ్రామిక, ఇతర సేవా రంగాల్లో పనిచేసే మహిళలకు ఈ హాస్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు .
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


