విశాఖపట్నం, మార్చి (పున్నమి ప్రతినిధి):
విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వివరాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని ఎల్వీనగర్లో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనలో నేవీ టెక్నీషియన్ రవీంద్ర(35) తన ప్రియురాలు మౌనిక(29)ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన విషయం తీవ్ర కలకలం రేపుతోందన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా రవీంద్రకు మౌనికతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి ప్రేమ సంబంధంగా మారిందని తెలిపారు. అయితే 2024లో రవీంద్రకు వివాహం జరిగినప్పటికీ, మౌనికతో సంబంధాన్ని కొనసాగించినట్లు చెప్పారు. ఇటీవల రవీంద్ర భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన నేపథ్యంలో, ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడని, ఈ సమయంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై వాగ్వాదం చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ముందుగానే ప్రణాళిక ప్రకారం రవీంద్ర మౌనికను ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందని, అనంతరం ఆధారాలను చెరిపివేయాలనే ఉద్దేశంతో శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేయాలని యత్నించినట్లు చెప్పారు. కాగా, మౌనిక శరీర భాగాల్లో తల కనిపించకపోవడం కేసుకు మరింత మిస్టరీగా మారిందన్నారు. మరోవైపు నేరభారం తట్టుకోలేక రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన పోలీసులు, మిగిలిన శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. విచారణలో కీలక ఆధారాలు సేకరించి మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలను బయటపెట్టినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న మౌనిక తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. విశాఖలో చోటుచేసుకున్న ఈ దారుణ హత్య ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతోందని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.
Uploaded Video:



