విశాఖనగరంలో 88.35 కి.మీ. రహదారుల అభివృద్ధికి ‘వార్షిక చెల్లింపు (Annuity Payout Model) నమూనా’కు జీవీఎంసీ ఆమోదం .
*జీవీఎంసీ అభివృద్ధికి ప్రయోజనం, ఆర్థిక లాభం దిశగా ఖర్చుల నియంత్రణ.
– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 88.35 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం **’వార్షిక చెల్లింపు నమూనా’ (Annuity Payout Model)ను అమలు చేయడానికి జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 307 కోట్లతో ఈ నూతన విధానం ద్వారా రహదారుల నాణ్యతలో స్థిరత్వం, నిర్మాణంలో ఏకరూపత, మరియు గడువులోగా పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందని, తద్వారా జీవీఎంసీ కి ఆర్థిక లాభం దిశగా ఖర్చుల నియంత్రణ జరుగునని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.
ఇది విశాఖ నగరంలో మొట్టమొదటిగా కొత్త విధానంగా మంచి ప్రయోజనాలతో ప్రవేశ పెట్టడం జరిగిందని,
ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న పనుల కోసం అనేక కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతికి భిన్నంగా, ఈ హైబ్రిడ్ వార్షిక చెల్లింపు నమూనా (Hybrid Annuity Model) కింద, మొత్తం ప్రాజెక్టును ఒకే పెద్ద కాంట్రాక్టర్‌కు అప్పగించడం జరుగుతుందని,ఇది రహదారి డిజైన్‌లో స్థిరమైన నాణ్యతను, ఏకరూపతను నిర్ధారిస్తుందన్నారు.
ప్రస్తుతం రహదారుల నిర్వహణ కోసం జీవీఎంసీ ఏటా సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేస్తోందని,తరచుగా టెండర్లు పిలవాల్సిన అవసరం ఉన్న ప్రస్తుత పద్ధతి కంటే, ఈ వార్షిక చెల్లింపు నమూనా కింద పనిని ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా బహుళ టెండర్ల వల్ల కలిగే జాప్యాన్ని నివారించి, అధిక-నాణ్యత ఫలితాలు అందించగల ప్రతిష్టాత్మక కాంట్రాక్టర్లను ఆకర్షిస్తుందన్నారు.
40 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న ప్రధాన రహదారులను ఈ ప్రాజెక్టులో కవర్ చేస్తారని, ఇందులో రోడ్డు పునరుద్ధరణ (resurfacing), సెంట్రల్ మీడియన్ అభివృద్ధి, పచ్చదనం పెంపు, మరియు వివిధ పట్టణ సౌకర్యాలు (urban amenities) కల్పించడం ఉంటాయన్నారు.
హైదరాబాద్, తిరువనంతపురం వంటి నగరాలలో విజయవంతమైన ఈ నమూనాను అమలు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు సంవత్సరం క్రితం విశాఖపట్నంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమోదం తెలిపారన్నారు.
జోన్ II, III, IV, V, మరియు VI లలో ఉన్న ముఖ్యమైన, ప్రధానమైన, ఆర్టీరియల్ , V V I P రాకపోకల రహదారుల సాంకేతిక పరిశీలన, ట్రాఫిక్ సాంద్రత, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఆధారంగా ఎంపిక జరిగిందన్నారు.
ప్రాజెక్ట్ లైటింగ్, యుటిలిటీ డక్ట్‌లు, సీసీ కెమెరాలు, చెత్త బుట్టలు, బెంచీలు, భద్రతకు సంబంధించిన పరికరాలు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, బయో-టాయిలెట్‌లు, పార్కింగ్, వే-ఫైండింగ్ సిస్టమ్‌లు ,బస్ షెల్టర్ల వంటి మూలధన వ్యయాన్ని (Capital Expenditure) బిడ్డర్ పరిధిలో చేర్చామన్నారు.
ఆపరేషన్ మరియు నిర్వహణ (O&M) బాధ్యతల్లో మెకానికల్ స్వీపింగ్, డ్రైనేజీ శుభ్రత, గుంతల మరమ్మత్తులు, ల్యాండ్‌స్కేపింగ్, వీధి దీపాల నిర్వహణ, రోడ్ మార్కింగ్, రోడ్డు మరియు వీధి ఫర్నిచర్ నిర్వహణ, కూడళ్ల సివిల్ మరియు ఎలక్ట్రికల్ నిర్వహణ వంటివి ఉంటాయన్నారు.
కేటాయించిన పనులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని, ఆ తర్వాత, కాంట్రాక్టర్ 10 సంవత్సరాల పాటు ఆ రహదారులను నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ రహదారుల వెంట అభివృద్ధి చేయబడే ప్రకటనలు (Advertisements), ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే రాబడిని వార్షిక చెల్లింపుల (Annuity Payments)కు సర్దుబాటు చేయబడుతుందన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (APUIAML) జీవీఎంసీకి లావాదేవీల సలహా (TransactionGood Advisory), స్వతంత్ర ఇంజనీర్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తుందన్నారు.
ఎంపిక చేసిన రహదారులు జోన్ – 2 లో 31.61 కి.మీ., జోన్ – 3 లో 14.24 కి.మీ., జోన్- 4 లో 8.65 కి.మీ.,జోన్-5 లో 3.70 కి.మీ.,జోన్- 6 లో 30.15 కి.మీ. మొత్తంగా 88.35 కి.మీ ఆన్యూటీ పే అవుట్ మోడల్ లో అభివృద్ధి చేయబడతాయని, ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రధాన రహదారుల నిర్వహణను హైబ్రిడ్ వార్షిక చెల్లింపు నమూనా కింద చేపట్టాలని నిర్ణయించడమైనదని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు.


