సిపిఐ (మావోయిస్టు పార్టీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విప్లవోద్యమంపై, పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగిన రాజ్యం చేతిలో, ప్రజల త్యాగాల విప్లవోద్యమ నిర్మాణాలు, సమూలంగా నిర్మూలించబడుతున్న నేటి విధ్వంసకర దుస్థితిలో.. ఉద్యమకారులు జీవించి ఉండడం (ప్రాణాలతో బయటపడడం) కూడా ఒక విజయంగా భావించే అనివార్యమైన ఒక విపత్కర పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఈ దుస్థితికి ప్రధాన కారణం ఉద్యమ నాయకత్వాలే తప్పా, మరెవ్వరూ కాదు! ఎందుకంటే సామాజిక, ఆర్థిక అసమానతలకు నిలయమైన ఈ దేశంలో ఉన్నంత అనుకూల విప్లవ పరిస్థితి, మరే దేశంలోనూ లేదు కాబట్టి! ఇక మానవ సమాజాన్ని శ్రామిక కోణంలోనూ, వర్గ దృక్పథంతోనూ విశ్లేషించే విముక్తి చేసే, ఒక అద్భుతమైన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని, ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులకు, స్థల కాలాలకు అన్వయించి, ప్రజలను చైతన్యం చేయడంలో విప్లవ నాయకత్వాలు విఫలమయ్యాయి కాబట్టి! 1925 లో కమ్యూనిస్టు పార్టీ పుట్టిన నాటి నుండి నేటి వరకు కూడా, పార్టీల్లో అతివాదుల ఆలోచన విధానాల సెక్టేరియన్ చర్యల ఫలితాలే, ఈ దేశంలో అనేక సార్లు విప్లవ ఉద్యమాలు బలహీనం అవ్వడానికి, విఫలం అవడానికి ప్రధాన కారణాలు!
ఇలాంటి ఈ దుస్థితుల్లో, నేడు ఉద్యమ సహచరులు బహిరంగ జీవితంలోకి రావడం అంటే (లొంగిపోవడం), అది విప్లవ ద్రోహం కాదు! ఇంతకాలం వాళ్ళు ఉద్యమ జీవితంలో, చావుతో సవాల్ చేసి బతికినవాళ్లు. నేడు చావుకు భయపడి వాళ్ళు బయటకు రావడం లేదు! అయితే లొంగిపోతున్న విధానంలో కొన్ని సంఘటనలు, వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశాలుగా ఉండవచ్చు. వాటిని విడిగా చర్చించుకోవాలే తప్పా, అవే ప్రధాన అంశాలు కాదు! ఏదిఏమైనా ఈ పరిస్థితుల్లో ఉద్యమ సహచరులు బహిరంగ జీవితంలోకి రావడం, విప్లవ ద్రోహం ఎంత మాత్రం కాదు! ఈ లొంగిపోవడం అనే బాధాకరమైన ఈ పనిని, విప్లవద్రోహం అని అంటున్న వాళ్ళు, మరి ఇన్నేళ్ళ ఆ ఉద్యమ సహచరుల కాంట్రిబ్యూషన్ను వీళ్ళు ఎందుకు గుర్తించరు? అలా గుర్తించనప్పుడు, ఈ నిందారోపణలు చేసే హక్కు నాయకత్వానికి గానీ, ఈ కుహనా విప్లవ మేధావులకు గానీ లేదు!
నిజంగా బయట ఉన్న ఈ సామాజిక విప్లవ మేధావులకు ప్రజల పట్ల, వారి జీవన వికాసం పట్ల ఏమాత్రం బాధ్యత ప్రేమ ఉన్నా.. అనివార్య పరిస్థితుల్లో లొంగిపోతున్న వీళ్ళందర్నీ కలిసి, ఉద్యమ పార్టీలతో, ప్రజాసంఘాలతో ఒక ఐక్య ఉద్యమ కార్యాచరణ కమిటీని నిర్మించి, ఈ ప్రత్యామ్నాయ ఉద్యమ వేదిక ద్వారా, నమ్ముకున్న ప్రజలకు, మేమున్నాం అని, ఒక భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత, ఈ బుద్ధి జీవుల మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది, ఈ విధమైన ప్రయత్నాన్ని. కానీ ఈ పని వీళ్ళు చేయకుండా, బయటకు వస్తున్న విప్లవకారుల మీద, నిస్సిగ్గుగా దుర్మార్గంగా ఈ విధమైన నిందారోపణలు చేయడం, అత్యంత హేయమైన చర్య..
విప్లవం వర్ధిల్లాలి


