*వినూత్న బోధన ద్వారా విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి*
*ఎండాడ జెడ్పీ, ఎంపీపీ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
*విశాఖపట్టణం పున్నమి ప్రతినిధి:- * వినూత్న బోధనా పద్ధతులను అవలంబించటం ద్వారా ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ఎండాడలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. అక్కడి విద్యార్థులతో మమేకమయ్యారు. పలు అంశాలపై ముచ్చటిస్తూ కుశల ప్రశ్నలు వేశారు. వివిధ పాఠ్యాంశాల్లోని అంశాలపై ప్రశ్నలు అడిగారు. పుస్తకాలను, అందులోని చిత్రాలను చూపించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. వినూత్న రీతిలో ఆసక్తిరేకించే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని, తార్కిక భావజాలం విద్యార్థుల్లో పెంపొందేలా బోధన సాగించాలని సూచించారు. పిల్లలు అడిగే అన్ని ప్రశ్నలకు స్నేహకూర్వక వాతావరణంలో సమాధానం ఇవ్వాలని, అప్పుడే వారిలో బిడియం పోతుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలోని ఇతర వసతులను, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. వివిధ రికార్డులను తనిఖీ చేశారు. అక్కడున్న సమస్యలను, ఇతర అంశాలను ఉపాధ్యాయులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.


