విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి ఎస్ యు) లో నెహ్రూ యువ కేంద్రం, నెల్లూరు మరియు వి ఎస్ యు ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ను నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
ఈ కార్యక్రమం యువతకు తమ ఆలోచనలు, అభిప్రాయాలను దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రదర్శించేందుకు ఒక ఉత్తమ వేదికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులు ఇందులో పాల్గొనవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు “My Bharat” పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, వికసిత్ భారత్ పై తమ ఆలోచనలను వివరించే ఒక నిమిషం వీడియోను చిత్రీకరించి, వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నెల్లూరు నోడల్ డిస్ట్రిక్ట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.
ఈ ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 150 మంది యువతను ఎంపిక చేసి, “వన్ నేషన్, వన్ ఎలక్షన్” అనే అంశంపై మూడు లేదా నాలుగు నిమిషాలు మౌఖికంగా మాట్లాడే అవకాశం కల్పించబడుతుంది. ఐదుగురు జ్యూరీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 మందిని ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్‌కు పంపించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు ఎంపికై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జాతీయ స్థాయిలో తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం పొందుతారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. పూర్తి వివరాల కోసం:
ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త: డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం (8187814140)
నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి: డాక్టర్ ఏ. మహేందర్ రెడ్డి (99635 33440)
సమయాన్ని సద్వినియోగం చేసుకొని యువతీ, యువకులు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

