గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత – జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన 23 పతకాల విజేతకు నగర ప్రముఖుల అభినందనలు
తాటిచెట్లపాలెం, అక్టోబర్ 27:
విశాఖపట్నం వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ బేరక్స్‌లో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 30+ మహిళల విభాగంలో పాల్గొన్న దువ్వూరి సరోజినీ అద్భుత ప్రతిభ ప్రదర్శించింది. 100 మీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్ల నడక పోటీలలో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని, గుంటూరులో డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
కైలాసపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు రాజేశ్వరరావు – జోగులాంబ దంపతుల కుమార్తె సరోజినీ, గత రెండేళ్లలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో అద్భుత విజయాలు సాధిస్తూ 13 స్వర్ణ, 6 రజత, 4 కాంస్య పతకాలతో మొత్తం 23 పతకాలు తన ఖాతాలో వేసుకుంది.
సరోజినీ ఇప్పటివరకు నెల్లూరు, గుడివాడ, కేరళలోని ఉడుపి, మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్‌లోని అల్వార్, అయోధ్య తదితర ప్రదేశాలలో పోటీల్లో పాల్గొని విశాఖ ప్రతిష్టను నిలబెట్టింది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ డా. శంక బ్రత బాగ్చి, వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డా. కమల్ బయిద్, వరల్డ్ టీచర్ ట్రస్ట్ డైరెక్టర్ చింతలపాటి సత్యదేవ్, ఇండియా సెక్రటరీ జనరల్ డా. మంగా వరప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ చైర్‌పర్సన్ వంశీ చింతలపాటి, మాజీ ఏడీసీపీ మహమ్మద్ ఖాన్ తదితరులు ఆమెను అభినందించారు.
సరోజినీ అంతర్జాతీయ స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ప్రముఖులు ఆశీర్వదించారు.


