విశాఖపట్నం, అక్టోబర్ 21:
జీవీఎంసీ వార్డుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో మధురవాడ, భీమిలి జోనల్ కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, కళ్యాణ మండపాలు, హౌసింగ్ తదితర సమస్యల పరిష్కారానికి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, కమిషనర్ కేతన్ గార్గ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎండాడ మెయిన్ రోడ్డులో ఫుట్ పాత్ వ్యాపారులకు ప్రతిపాదించిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈట్ స్ట్రీట్ ను సాగర్ నగర్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తే ఎక్కువమందికి అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిల్లపేట చెరువు వద్ద రిటైనింగ్ వాల్ కు ఎక్కువ వ్యయమవుతుందని.. భీమిలి, తగరపువలస మెయిన్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనల గురించి వివరిస్తూ ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. భీమిలి క్లాక్ టవర్ డిజైన్ ను సిద్ధం చేయాలన్నారు.
ఓపెన్ స్పేస్ లలో ఆక్రమణలు తొలగించండి
సామాజిక అవసరాల కోసం వదిలిన ఓపెన్ స్పేస్ ల ఆక్రమణపై గంటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ వార్డుల్లోని 149 ఓపెన్ స్పేస్ లలో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే 24 పార్కులను అభివృద్ధి చేయగా.. 25 పార్కులను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. దీనిపై గంటా స్పందిస్తూ.. గతంలో వైసీపీ నాయకుల అధీనంలో ఉన్న వైభవ్ నగర్ పార్కుల తాళాలు తీయించి అప్పజెప్పామని, వాటిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. స్థానిక అసోసియేషన్ లు బాధ్యత తీసుకున్నప్పుడే పార్కులు అభివృద్ధి చెందుతాయన్నారు. పార్కుల అభివృద్ధి కోసం 2, 4 వార్డులను ఎంపిక చేశామని అధికారులు తెలియజేశారు. జోనల్ కమిషనర్లు కనక మహాలక్ష్మి, అయ్యప్పనాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.


