ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి లో వాడపల్లి వెంకన్న “కోనేరు”కు మహర్దశ
రూ. 2.5 కోట్ల తో అభివృద్ధి
తిరుమల తరహాలో నిర్మాణం
భక్తులకు ఆహ్లాదకరమైన ప్రదేశం
వాడపల్లి విశిష్టత -10
కోనసీమ తిరుమల గా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి దేవస్థానం కోనేరుకు మహర్దశ వస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి ఆదరణకు నోచుకోని ఈ కోనేరును సుమారు రూ. 2.5 కోట్ల నిధులతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.వెంకటేశ్వర స్వామి ఆలయంకు తూర్పు వైపున గోదావరి ఏటి గట్టును ఆనుకుని సువిశాలమైన ప్రదేశంలో ఈ కోనేరు అన్ని ఆధునిక హంగులతో ముస్తాబవుతుంది.నూతనంగా నిర్మించే ఈ కోనేరు వాడపల్లి దేవస్థానానికి నూతన శోభను తీసుకురాబోతుంది. ఆలయ రాజగోపురం ముందు నుంచి ఏటిగట్టు వరకు జరిగే ఈ సుందరీకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చే భక్తులకు ఇప్పటివరకు కనీసం సేద తీరడానికి ఒక ప్రదేశమంటూ లేదు. ఇప్పుడు ఈ కోనేరు ఆధునీకరణ ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు సేదతీరడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కోనేరుకు నాలుగు వైపులా అందమైన మొక్కలతో పార్కును తీర్చిదిద్దరున్నారు. అందువల్ల వాడపల్లి వచ్చే భక్తులకు ఈ కోనేరు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర ప్రదేశంగా మారనుంది.
తిరుమల కోనేరు తరహాలో…
విశ్వవ్యాప్త ప్రసిద్ధికెక్కిన తిరుమలేసుని ఆలయం వద్ద ఉండే కోనేరు తరహాలోనే వాడపల్లిలో కూడా కోనేరు రూపుదిద్దుకోబోతుంది. కళ్ళు చెదిరే అందాలతో ఇది ముస్తాబు కాబోతుంది. ఇప్పటికే ఈ కోనేరు చుట్టూ సీసీ బండ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. అనంతరం గ్రానైట్ రాయిని ఏర్పాటు చేస్తారు. అలాగే నాలుగు వైపులా మెట్ల నిర్మాణం చేపడతారు. సుమారు ఆరు అంగుళాల ఎత్తులో పది మెట్లు వస్తాయి. అలాగే అందమైన పచ్చదనం భక్తులను కనువిందు చేయనుంది. దీంతోపాటు విద్యుత్ అలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కోనేరు నిర్మాణం పూర్తవుతే వాడపల్లి ఆధ్యాత్మిక కేంద్రానికి మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఈ కోనేరు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు వీలుంటుంది. ఈ కోనేరు మొత్తం ఎకరా 26 సెంట్లులో రూపుదిద్దుకుంటుంది. నాలుగు వైపులా సుమారు 171 అడుగుల వెడల్పున పాలరాతి ట్రాక్ వస్తుంది. అలాగే ఏటిగట్టు నుండి ఆలయ మాడవీధుల వరకు విశాలమైన సిమెంట్ రోడ్డును నిర్మిస్తున్నారు.వాడపల్లి దేవస్థానం వద్ద భక్తులకు కాటేజీ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుల ఆధ్వర్యంలో ముమ్మర కసరత్తులు జరుగుతున్నాయి. కాటేజిలలో ఉండే భక్తులకు ఈ కోనేరు అందాలు కనువిందు చేయనున్నాయి.ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
అమరవీరుల స్థూపం కూడా ప్రత్యేక ఆకర్షణ
ప్రస్తుతం దేవస్థాన రాజగోపురం ముందు ఉన్న అమరవీరుల స్థూపం కూడా ఈ కోనేరు సమీపంలో ఆకర్షణీయంగా సెల్ఫీ పాయింటుగా నిర్మించడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇచ్చి ఉన్నారు. ఈ కోనేరు సుందరీకరణతో పాటు ఈ అమరవీరుల స్థూపాన్ని కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. వాడపల్లి స్వామివారి ఉత్సవాల్లో రధానిపై జాతీయ జెండా ఎగరవేసినందుకుగాను బ్రిటిష్ వారు కాల్పులు జరపగా నలుగురు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆనాడు బ్రిటిష్ వారిని ఎదిరించి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి భక్తి తోపాటు దేశభక్తిని చాటిచెప్పిన అమరవీరులు చరిత్ర పది కాలాలపాటు అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు ఈ స్థూపాన్ని చారిత్రాత్మక కట్టడం గా రూపొందిస్తున్నారు.అమర వీరుల పోరాట పటిమ,ఈ గడ్డ స్వతంత్ర ఉద్యమకారుల అడ్డా అని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే లక్ష్యంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ స్తూపానికి మహర్దశ తీసుకొస్తున్నారు.కొండ్రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్ వాడపల్లి వెంకన్న భక్తులు.


