-చిట్వేల్ – రాపూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం – అనుంపల్లి వద్ద రాజుకుంట అలుగు ఉధృతిపై సిబ్బందికి కీలక సూచనలు
చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిట్వేల్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను రాజంపేట అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే గురువారం సందర్శించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన పలు సూచనలు చేశారు.
-అనుంపల్లి వద్ద పరిశీలన
ఏఎస్పీ హెగ్డే గారు ముఖ్యంగా చిట్వేల్ – రాపూరు రోడ్డు లోని అనుంపల్లి గ్రామం వద్ద ఉన్న పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాజుకుంట చెరువు అలుగు ఉద్ధృతంగా పారుతూ రోడ్డుపైకి చేరడం వల్ల వాహన రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.
-సిబ్బందికి, ప్రజలకు సూచనలు
పరిశీలన అనంతరం, ఏఎస్పీ మాట్లాడుతూ, రోడ్డుపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ సాహసించి రోడ్డు దాటవద్దని కోరారు. అలాగే, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీటి ప్రవాహం తగ్గే వరకు ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.


