చిట్వేల్, అక్టోబర్ 18 (ఎల్లో సింగం ప్రతినిధి)
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రతిభావంతులైన విద్యార్థులకు‘ప్రతిభ అవార్డులు’ ప్రదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా.యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు సివిల్ జూనియర్ జడ్జి శ్రీ పి.జె.తేజ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రిన్సిపాల్ డా. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ“విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి అవార్డులు పొందడం ఎంతో ఆనందకరం. వీరిని స్పూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా విజయం సాధించాలని” తెలిపారు.ముఖ్య అతిథి జడ్జి పి.జె. తేజ సాయి మాట్లాడుతూ “ప్రస్తుత కాలంలో కొంతమంది యువత ఫ్యాషన్ మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు” అని సూచించారు.ఈ సందర్భంగా దాత శ్రీ పాములపాటి సుబ్బారాయుడు తమ అన్నగారి జ్ఞాపకార్థం విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ప్రతి తరగతిలో ప్రథమ స్థానంలో ఉన్న వారికి ₹5,000, ద్వితీయ స్థానంలో ఉన్న వారికి ₹2,000, మహిళల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినులకు ₹3,000 చొప్పున బహుమతులు ఇచ్చారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. భాస్కర్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు యం. సుబ్బారెడ్డి పేరుతో “బెస్ట్ స్టూడెంట్ అవార్డు”ను కూడా ప్రధానించారు.కార్యక్రమం అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జడ్జి శ్రీ తేజ సాయి గారి చేతుల మీదుగా కళాశాల ఆవరణలో చెట్టు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వెంకట రామరాజు, సీనియర్ న్యాయవాదులు శ్రీ శంకరయ్య, శ్రీ గజపతివర్మ, వైస్ ప్రిన్సిపాల్ డా. జి. రమేష్, ఐ క్యు ఏ సి కో ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ డా. కె. రమేష్, యన్.యస్.ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


