రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు సంఘ నాయకులు, సిఐటియు ప్రతినిధులు బుధవారం ఉదయం రైల్వే కోడూరు తాసిల్దార్ అమరేందర్‌ను కలిసి చర్చించారు.
సోమవారం సబ్ కలెక్టర్‌ను కలిసి బొప్పాయి ధరను కలెక్టర్ నిర్ణయించిన రూ.10 కంటే తక్కువకు కొనుగోలు చేయరాదని విజ్ఞప్తి చేసిన విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాసిల్దార్ మాట్లాడుతూ—”కనీస ధర రూ.9 కంటే తగ్గకూడదు. 10 రూపాయల ధర రైతులకు రావాలి. దళారులు తక్కువ ధర చెల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
ఎమ్మార్వో సమావేశం అనంతరం కొంతమంది వ్యాపారులతో ఫోన్‌లో మాట్లాడగా, కొందరు రూ.9 ఇస్తామని అంగీకరించగా, మరికొందరు రూ.7–8 మాత్రమే ఇస్తామని తెలిపారు. దీనిపై ఎమ్మార్వో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు న్యాయం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్. చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షుడు లింగాల యానాదయ్య, రైతు సంఘ నాయకులు ఏదోటి ఆదినారాయణ, శివకృష్ణ చౌదరి, కొత్తపల్లి ఈశ్వరయ్య, జగదీష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


