పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భద్రాచలం పరిసర ఐదు గ్రామ పంచాయితీ లని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.
భద్రాచలం పట్టణం తెలంగాణలో ఉండగా, దానికి ఆనుకుని ఉన్న యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం వల్ల ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మల పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర తనిఖీలు, ఆరోగ్య–విద్యా సదుపాయాల లోపం, పరిపాలనా చిక్కులు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన వివరించారు. భద్రాచలం దేవస్థానం భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దేవాలయ అభివృద్ధి, భూముల వినియోగం కష్టతరం అవుతోందని చెప్పారు.
ఈ గ్రామాలను తెలంగాణకు చేర్చితే భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధి, గిరిజన చారిత్రక వైభవం మరింతగా వెలుగొందుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయ అంశం కాదని, ప్రజల ఆకాంక్ష, పరిపాలనా అవసరాలపై ఆధారపడిన డిమాండ్ అని స్పష్టం చేశారు.
“భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉన్నాడు… ఆయన భూములు ఆంధ్రలో ఉండటం అన్యాయం” అని పేర్కొంటూ, కేంద్రం సానుకూలంగా స్పందించాలని, రెండు రాష్ట్రాలు సమన్వయంతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.


