ముస్తాబాద్ము ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి
బడ్జెట్లో బీసీలకు ₹60 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ను తక్షణమే అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, ప్రతి ఏడాది ₹20 వేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాల్లో ₹1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ₹9 వేల కోట్లు కేటాయించి అందులో కేవలం ₹5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తరువాతి ఏడాది ₹11 వేల కోట్లు కేటాయించినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించలేదని విమర్శించారు.
బీసీలకు ఇచ్చిన హామీల మేరకు బాకీ ఉన్న నిధులతో కలిపి ఈసారి బడ్జెట్లో ₹60 వేల కోట్లు కేటాయించాలని, కేటాయింపులు అంకెలకే పరిమితం కాకుండా బీసీ జనాభా అభివృద్ధి, సంక్షేమానికి పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని కోరారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే బీసీ స్టడీ సర్కిళ్లు, కొత్త గురుకులాలు, ప్రత్యేక పాఠశాలలు, కులవృత్తుల కార్పొరేషన్లు, ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలని, పల్లెలు–పట్టణాల్లో బీసీ ఐక్యత భవనాలు నిర్మించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ మేధావులు, యువత, కార్మికులు, రైతులు పోరాటానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాల బిక్షపతి, పుల్లూరి రవి, బద్ద వెంకటి, మోతే నర్సింలు, బద్ద నాంపెల్లి, నీరటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

