ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి: సోమిరెడ్డి
వెంకటాచలం ఫిబ్రవరి 1 పున్నమి విలేఖరి
గత టిడిపి ప్రభుత్వానికి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించి ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. వైసీపీ నేతల అక్రమాలకు రెవెన్యూ, పోలీసు అధికారులు వంతపాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల సందర్భంగా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే బైండోవర్ చేస్తారా.. ఇది ఎక్కడి చట్టం అని ప్రశ్నించారు. బైండోవర్ పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తే అందరం వచ్చి పోలీసుస్టేషన్లలో కూర్చుంటానని అన్నారు.
ఎన్నికలు జరిగేది కాకాణి గోవర్ధన్ రెడ్డో లేక ఇంకొకరి ఆధీనంలోనో కాదని ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో అని గుర్తుంచుకోవాలన్నారు. తమకు ఓపిక నశించే పరిస్థితులు తేవొద్దని పోలీసు, రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. వైసీపీ నాయకులు ఎవరెవరు ఎక్కడెక్కడ, ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారో తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బయట పెడతామన్నారు.
చంద్రన్న బీమా, సీఎంఆర్ఎఫ్, పండగ కానుకలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ రుణాలు వంటి ఎన్నో పథకాలు కనిపించకపోయినా కరోనా పేరుతో కలెక్షన్లు ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా దోపిడీలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక లోడింగ్, ట్రాక్టర్ బాడుగతో కలిపి ట్రక్కు రూ.1200లోపే ఇంటికి వచ్చేదని,ఇప్పుడు ట్రక్కు ఇసుక రూ.7 వేలకు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి టన్ను ఇసుకకు రూ.375 జే ట్యాక్స్ విధిస్తే సర్వేపల్లిలో కాకాని విధించే కే ట్యాక్స్ రూ.4 వేలు అని మొత్తం కలిపి ట్రక్కు ఇసుక రూ.7 వేలకు చేరిందన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి, వైసీపీకి అధికారం ఇచ్చినోళ్లు కూడా జే ట్యాక్స్, కే ట్యాక్సులు కట్టాల్సిందేనా అని అన్నారు. గ్రావెల్, మట్టి, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు కళ్లు మూసుకుని ఉన్నారని, జనం డబ్బుతో జీతాలు తీసుకుంటూ ఇలా చేయడం సబబు కాదన్నారు. రెండు సార్లు ఓట్లేసి గెలిపించినందుకు రైతులు పుట్టి ధాన్యాన్ని రూ.16 వేలకు బదులు రూ.8 వేలకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు.
జే ట్యాక్సు, కే ట్యాక్సులతో రాష్ట్రం అధోగతి పాలుకాకుండా ఉండాలంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో, అటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీకి ప్రజలంతా గుణపాఠం చెప్పాలన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు గుమ్మడి రాజు యాదవ్, టిపి గూడూరు మండల అధ్యక్షుడు బొమ్మి సురేంద్ర, నేతలు కుంకాల నాగేంద్రప్రసాద్, మేదరమెట్ల కోదండరామ నాయుడు, గంటా బాబు, తదితరులు పాల్గొన్నారు.