ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్ పూర్తయ్యాక ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. కానీ, ఇదే అదనుగా విద్యార్థులు, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొనేందుకు నకిలీ వర్సిటీలు పుట్టుకురావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇలాంటి ఫేక్ వర్సిటీల మాయలో పడితే విద్యార్థులు మోసపోయే ప్రమాదం అధికం. ఇవి మీ సమయాన్నే కాదు.. డబ్బును, భవిష్యత్తునూ నాశనం చేస్తాయి. అందువల్ల నకిలీ యూనివర్సిటీలను(Fake Universities) గుర్తించి వాటి అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం.
జూన్ 2025 నాటికి మన దేశంలో 20 నకిలీ (Fake Universities In India) ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఆయా వర్సిటీల జాబితాను సైతం అందుబాటులో ఉంచింది. నిజమైన యూనివర్సిటీలు ఏవైనా సరే యూజీసీ లేదా ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొంది ఉండాలి. ఆ విద్యా సంస్థలకు మాత్రమే విద్యార్థులకు డిగ్రీలు మంజూరు చేసే అధికారం ఉంది. ఇవి ఇచ్చే డిగ్రీలకే విలువ ఉంటుంది. నకిలీ వర్సిటీలిచ్చే డిగ్రీలకు ఏమాత్రం విలువ ఉండదు. అందువల్ల మీరు చదవాలనుకొంటున్న యూనివర్సిటీ గురించి తెలుసుకొనేందుకు కొంచెం సమయం కేటాయించి అధ్యయనం చేయండి. ఆ తర్వాతే ఎంపిక చేసుకోవడం తెలివైన పని. 20 నకిలీ యూనివర్సిటీల జాబితా కోసం క్లిక్ చేయండి.
ఫేక్ యూనివర్సిటీలను గుర్తించడం ఎలా?
విద్యార్థుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రయత్నిస్తుంటాయి. తమ వర్సిటీ/విద్యా సంస్థలో చేరాలంటూ పదే పదే వెంటపడి వేధిస్తే సందేహించాల్సిందే!
సాధారణ సమయం కన్నా తక్కువ వ్యవధిలోనే కోర్సుల్ని పూర్తి చేయిస్తామని చెబుతుండటం.
తక్కువ ఫీజులతో కోర్సుల్ని అందించడంతో పాటు, ప్లేస్మెంట్ హామీలు గుప్పించడం
యూనివర్సిటీలో సిబ్బంది, అందించే కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచకపోవడం వంటి అసాధారణ లక్షణాలను గమనిస్తే అప్రమత్తంగా ఉండటమే మేలు.
ఇలా చేయండి..
మీరు చేరాలనుకొంటున్న వర్సిటీ విశ్వసనీయతను తెలుసుకొనేందుకు ఆ కాలేజీలో చదువుతున్న, పూర్వ విద్యార్థులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.
యూజీసీ అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు సందర్శించి అప్డేట్స్ చెక్ చేసుకోవడం.
నకిలీ యూనివర్సిటీలు చాలా వరకు క్యాంపస్ లేకుండా ఆన్లైన్లోనే పనిచేస్తుంటాయి. నిజమైన వర్సిటీలకైతే భవనాలు, ల్యాబ్లు, లైబ్రరీలు ఉంటాయి. అందువల్ల మీరు చేరాలనుకొనే విద్యాసంస్థ క్యాంపస్ని ఒకసారి సందర్శించి రండి.
తక్కువ ఫీజులకే కోర్సులంటే తొందరపడి చేరిపోవద్దు. దానిపై కాస్త అధ్యయనం చేయండి. సామాజిక మాధ్యమాల్లో సంబంధిత వర్సిటీల రివ్యూలను చూడండి.
ఆ వర్సిటీలు అందించే కోర్సులకు ఏఐసీటీఈ, న్యాక్ వంటి ఇతర సంస్థల గుర్తింపు ఉందో లేదో చెక్ చేయండి.


