దేవతా గుర్రాలు-నేటి యువత*….. (పున్నమి ప్రతినిధి:::: చింతా ప్రసాద్ బాబు)

0
261

 

*దేవతా గుర్రాలు-నేటి యువత

అనగనగా రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు.

కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత. రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది.

అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి పోయి, భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమై పోయింది. కానీ నాదో చిన్న కోరిక అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించిన భగవంతుడు చిరునవ్వు నవ్వి నువ్వు దేవతా గుర్రానివి నీ కోరిక తీర్చుతాను ఏం కావాలో కోరుకో!’ అన్నాడు.

నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది. సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు అవన్నీ సరిదిద్దుతాను అని అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది.

ఈ తల మెడకి అంటుకు పోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా సన్నగా ఉందని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దుదురూ! అంది గుర్రం. తథాస్తు! రేపు ఉదయం నిద్ర లేచి చూసుకునే సరికి నీవు కోరుకున్న సరికొత్త రూపం నీకు వస్తుంది అన్నాడు భగవంతుడు. సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది మొదటి గుర్రం.

అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించు కోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణిచి అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ ఏ లక్షణాలనైతే కోరుకొందో… అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి అని వేడుకుంది. అయ్యో అదెంత భాగ్యం, అసలే నువ్వు దేవతా గుర్రానివి కనుక నీ కోరికను తీర్చాల్సిందే, రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు అంటూ నవ్వాడు భగవంతుడు.

ఆ రాత్రి రెండు గుర్రాలకు సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా… తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే… మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది. తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి.. ఆయనను చూస్తూనే ఏమిటీ మాకీ అన్యాయం! అంటూ ఆక్రోశించాయి.

మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది. ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే… మరింత బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాన్ని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది. కానీ మీరు పై పై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. కనుక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారు కొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి ఉంటుందని అనేశాడు భగవంతుడు. అదీ విషయం!.

ఇది కథ మాత్రమే. కానీ దీనిని ఇప్పటి యువకుల జీవితాలకు, విద్యార్థుల చదువులకు అన్వయించి చూస్తే… ఇప్పటికి నేటి యువత వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలకు తృప్తిపడి వాటిని మరింత మెరుగు పెట్టుకోవడం మాని అవసరం లేని దాని కోసం వెంపర్లాడుతూ విలువైన సమయాన్ని, సహజ సిద్ధమైన శక్తియుక్తులను మర్చి పొతున్నారు.

విద్యార్థులు జ్ఞాన సముపార్జన కన్నా ర్యాంకులు, మార్కులు తప్ప విషయ పరిజ్ఞానాన్ని పొందలేక జీవితాల్లో చాలా సందర్భాల్లో ఆశించిన దానిని పొందకుండా ఆత్మహత్యల వైపు, అసాంఘిక కార్యకలాపాల వైపు, లేదంటే అనారోగ్యకర అలవాట్ల వైపు వెళ్లి విలువైన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు.

నేటి యువతకు, విద్యార్థులకు పై సందేశాన్ని అందించినవారు మురళీ కృష్ణ హోటల్స్ వీరిశెట్టి హజరత్ బాబు.

0
0