విశాఖపట్నం, అక్టోబర్ 28:
‘మెంథా’ తుఫాన్ తీవ్రరూపం దాల్చబోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయని హెచ్చరిస్తూ, తీరప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేని బయటకు వెళ్లడాన్ని నివారించాలని సూచించారు.
“పరిస్థితి చేయజారిపోకముందే స్థానిక నాయకులు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సిద్ధంగా ఉండాలి. ప్రజల భద్రతే మన ప్రథమ కర్తవ్యం” అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తీరప్రాంతం మరియు కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రభుత్వం సురక్షిత వసతిగృహాలకు తరలించినట్లు తెలిపారు. ఈ సహాయక చర్యల్లో టీడీపీ మరియు కూటమి కార్యకర్తలు ముందుండి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
“రాబోయే 48 గంటలపాటు కూడా ఇదే క్రమశిక్షణ, నిబద్ధత కొనసాగించాలి. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తోడుగా, అధికారులకు అందుబాటులో ఉండాలి,” అని పల్లా సూచించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ముఖ్యమంత్రి స్వయంగా విభాగాల పనితీరును సమీక్షిస్తూ ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
మా యువ నాయకుడు నారా లోకేష్ గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్‌లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, ఫీల్డ్ స్థాయి సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరిస్తున్నారని, ఆయన కృషి, నిబద్ధత అభినందనీయమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇక వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో పాత తుఫాన్ల (హుద్‌హుద్, టిట్లీ) చిత్రాలు, వీడియోలు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని రేకెత్తించడం బాధాకరమని తీవ్రంగా ఖండించారు.
“సహాయం చేయలేకపోతే కనీసం ప్రజల్లో భయం సృష్టించకండి. సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వాడండి. మనమందరం ఐక్యంగా ఈ సవాళ్లను ఎదుర్కొని నిలబడతాం,” అని పల్లా స్పష్టం చేశారు.
“చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ పర్యవేక్షణ, ఆంధ్రప్రజల ధైర్యం కలిసి ఈ విపత్తును కూడా జయించగలవు,” అని ధీమా వ్యక్తం చేశారు.


