*తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
విశాఖపట్టణం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి ః నగరంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. మంగళవారం ఉదయం కైలాసపురం, శాంతినగర్, కస్తూరినగర్, మాధవధార అంబేద్కర్ కాలనీల్లో తుపాను పరిస్థితిని సమీక్షించి, అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఇలాంటి సమయంలో కొండవాలు ప్రాంతాల్లో ఉండటం ప్రమాదకరమని, దయచేసి సమీపంలోని నివాసితులందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలాంటి సహాయమైనా అందిస్తారని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించామని, పరిస్థితులు మారే వరకు అందరూ అక్కడ తలదాచుకోవాలని చెప్పారు. మాధవధార అంబేద్కర్ కాలనీలోని వాంబే గృహ సముదాయాలను సందర్శించి అక్కడ పరిస్థితులను గమనించారు. పాక్షికంగా దెబ్బతిన్న గోడను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని స్థానిక అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట జోనల్ ప్రత్యేకాధికారి మాధవి, రెవెన్యూ, ఇతర అధికారులు ఉన్నారు.


