-ఎక్కడికో చెప్తే అదే తీసుకెళుతుంది.
పున్నమి ప్రతినిధి:
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ సంస్థ ఒమెగా సీకి మొబిలిటీ దేశంలో తొలి సెల్ఫ్-డ్రైవింగ్ ఆటోను పరిచయం చేసింది. ‘స్వయంగతి’ పేరిట ఈ ఎలక్ట్రిక్ ఆటోను లాంఛనంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ప్యాసింజర్ వెర్షన్ ధర రూ.4 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కాగా.. కార్గో వెర్షన్ రూ.4.15 లక్షలకు (ఎక్స్ షోరూమ్) లభించనుంది. ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలో మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది.స్వయంగతి ఆటో.. 10.3kWh బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ వాహనానికి అవసరమైన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఇందులో కంపెనీ ఈవీ ప్లాట్‌ఫాంతో పాటు ఏఐ ఆధారిత అటానమీ సిస్టమ్ ఉంది. లైడార్ టెక్నాలజీ, జీపీఎస్, 6 కిలోమీటర్ల దూరం వరకు అడ్డంకులను గుర్తించే సెన్సర్లు, మల్టీ సెన్సర్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ లేకుండానే ముందుగానే మ్యాప్ చేసిన మార్గంలో ప్రయాణించగలదు. మొదటి దశ పరీక్షలు విజయవంతం కాగా.. రెండో దశ పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని సంస్థ చెప్పింది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో నియంత్రిత కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి.


