అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్యులు శాసనసభలో వెల్లడించారు. మామిడికుదురు మండలం, పెదపట్నంలంక గ్రామంలో ఆధునిక కొబ్బరి పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక రైతులకు నేరుగా లాభాలు చేకూరుతాయని, వారి ఉత్పత్తులకు తగిన ధర లభిస్తుందని అన్నారు. కొబ్బరి పీచు, నూనె, నీరు, శెల్లు, హస్తకళలు వంటి ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్, ఎగుమతి సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. దీంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమలో ఆర్థికాభివృద్ధి వేగవంతమై, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయ సంఘాలకు కూడా ఈ పరిశ్రమ ద్వారా సహకారం అందజేస్తామని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో కొత్త వ్యాపారాలు ఆవిర్భవించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రైతు కుటుంబాలకు ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రివర్యులు అన్నారు.


