*టపాసుల గోదాములు, తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టండి*
*48 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని అగ్నిమాపకశాఖ అధికారులకు ఆదేశం*
*నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు*
*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల*
*నెల్లూరు:* రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి, 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బుధవారం ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలులో ఉన్నాయో లేదో సమగ్రంగా పరిశీలించాలని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డికి కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.తయారీ కేంద్రాల సమీపంలో పాఠశాలలు లేదా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలని, కేవలం లైసెన్సు పొందినవారే బాణాసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలన్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.


