విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి)
విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఇంజినీరింగ్ విభాగంలో కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు అనుబంధ కాంట్రాక్టర్ల పేర్లతో టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన కొలతలు స్వయంగా తీసుకుని, ఎం-బుక్ నమోదు కోసం అసిస్టెంట్ ఇంజినీర్లకు (ఏఈలు) అందజేస్తున్నారన్న సమాచారం బయటకు వస్తోంది. ఏటా సుమారు రూ.500 కోట్ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు జోన్లలో ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్క్ ఇన్స్పెక్టర్లు పరోక్షంగా కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తే పారదర్శకత దెబ్బతింటుందని సిబ్బంది వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేరినప్పటికీ స్పష్టమైన చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని పౌరసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



