జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని నెల్లూరు పోలీసుల హెచ్చరిక
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు మరియు నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు లేదా వేధింపులు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, రౌడీ, కెడి, డీసీ కదలికలపై పటిష్ట నిఘా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలు చేస్తే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
నేరాల నియంత్రణ కోసం జిల్లాలో కట్టుదిట్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బీట్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నేరాలను అరికట్టే చర్యలు చేపట్టామని వివరించారు.
గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై కూడా పోలీసులు నిరంతరం నిఘా పెంచినట్లు తెలిపారు. నేర ప్రవర్తనను మానుకుని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
కౌన్సెలింగ్ అనంతరం వారి ప్రస్తుత జీవన విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న పనులపై కూడా అధికారులు వివరాలు సేకరించారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు, అల్లర్లు లేదా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 9392903413 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు.
జిల్లాను ప్రశాంత జిల్లాగా నిలబెట్టడమే లక్ష్యంగా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.


