అల్లూరి సీతారామరాజు జిల్లా – అరకు, నవంబర్ 24:
కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయడం లక్ష్యంగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిని క్షేత్రస్థాయి కార్యకర్తల నిజమైన అభిప్రాయాల ఆధారంగా నియమించనున్నట్లు ఒడిశా రాష్ట్ర ఏఐసీసీ పరిశీలకుడు శ్రీ డెబాసిస్ పట్నాయక్ తెలిపారు.
సోమవారం అరకులోయలోని హోటల్ అక్షయ ఇన్ లో నిర్వహించిన “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశాన్ని ఏఐసీసీ సభ్యుడు శ్రీ వేగు వెంకటేష్ నిర్వహించారు.
కార్యక్రమంలో డీసీసీ నేత శతక బుల్లిబాబు, పీసీసీ సభ్యుడు వంతల సుబ్బారావు, అరకు అసెంబ్లీ ఇన్‌చార్జ్ శెట్టి గంగాధర్ స్వామి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోస్య ప్రేమ్ కుమార్, ఓబిసి ఏ.ఎస్.ఆర్ జిల్లా అధ్యక్షుడు కానూరి ప్రవీణ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
డెబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ—
“అల్లూరి జిల్లాలోని ప్రతి మండలంలో రాబోయే మూడు రోజుల్లో కార్యకర్తలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తాం. కార్యకర్తలకు అసలైన మాట చెప్పే అవకాశం ఇవ్వాలన్నదే ఏఐసీసీ లక్ష్యం. అభ్యర్థుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆ తరువాతే కొత్త డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తాం” అని తెలిపారు.
అదే విధంగా, కాంగ్రెస్ పార్టీని శక్తివంతం చేయడం, కమిటీల పునర్వ్యవస్థీకరణ, ప్రతి కార్యకర్తకు బాధ్యత కల్పించడం వంటి చర్యలు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి స్పష్టమైన దిశానిర్దేశాలేనని వివరించారు.
డీసీసీ పదవికి ఆసక్తి ఉన్న నాయకులు పరిశీలక బృందం అందజేసిన అధికారిక ఫారమ్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బురిడీ డేవిడ్, నోగెలి చంద్రకళ, సమీరెడ్డి బాలకృష్ణ, పాంగి గంగాధర్ సహా పెద్ద సంఖ్యలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.


