నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ 21: శ్రీ భైరవ కోన దుర్గా భైరవేశ్వర సంగ్రహ చరిత్ర : ఆర్యావర్తము, పుణ్య భూమి, దైవాన్ని దర్శించాలన్న భారత దేశంలో జన్మించవలెను. ఇది మన అభిప్రాయం కాదు. ఎందరో పాశ్చాత్య పండితుల అభిప్రాయం కూడా. మానవుని మోక్ష సాధనకు, అనేక మార్గములు చూపినది. హైందవ ధర్మమే “ఏకం సత్ విప్రా బహుదా వదంతి” సత్యం ఒక్కటే పండితులు దానిని అనేక విధములుగా తెలిపిరి. దుష్ట శిక్షణకు శిష్ఠ రక్షణకు భగవంతుడు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు అవతరించాడు. అదే విధంగా భక్తుల మనోభీష్ఠములను తీర్చుటకై జగదీశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపులతోనూ ఆది శక్తి జగన్మాత అష్టదశ శక్తి పీఠముల యందును అనేక రూపములలో అనేక ప్రదేశములలో వెలసి యున్నారు. అటువంటి పుణ్య క్షేత్రములలో బైరవ కోన క్షేత్రం ఒకటి. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నకు పదిహేను కిలోమీటర్లు దూరములో పచ్చటి చెట్లతో పక్షులు కిలకిలా రావములతో సెలయేర్లతో జలపాతములతో కనువిందుగా రమనీయ ప్రశాంత వాతావరణముతో ప్రకృతి శోభకు అలవాలమైన అటవీ ప్రాంతములో ఉన్నది.
ఇది శైవ క్షేత్రమైనను ఎచటనూ లేనివిధముగా ఈశ్వరాలయము నందు. బ్రహ్మ, విష్ణు విగ్రహములు ప్రతిష్ఠింపబడి యున్నవి. ఎచటనూ లేని విధముగా ఈశ్వరాలయము నందు బ్రహ్మ విష్ణు విగ్రహములు ప్రతిష్ఠింపబడుట విశేషము.
భైరవమహర్షి ఇచట తపస్సు చేయుట వలన ఈ ప్రాంతమునకు భైరవకోన అనియు సాక్షాత్తు పరమశివుడే ఈ ప్రాంతములో సంచరించుచుండుట వలనను క్షేత్రపాలకుడు భైరవస్వామి అగుటవలనను భైరవకోన అను పేరు వచ్చినది. ఇచట సమీపమునగల క్రొత్తపల్లె గ్రామములోగల క్షత్రియ దంపతులు బిడ్డలు లేక సంతాన ప్రాప్తికై ఈ భైరవాద్రిలో తపస్సు చేసుకొనుచున్న భైరవమహర్షిని ప్రార్ధించగా వారు అనుగ్రహించి ఒక షరతు విధించిరి. వారికి కలిగిన మగబిడ్డను 9 సంవత్సరములు వయసు రాగానే తనకు అప్పగించాలని కోరిరి. తదుపరి వారికి పుత్ర సంతానము కలిగెను. చెప్పిన మాట ప్రకారము ఆ బిడ్డను 9వ ఏడు వచ్చిన వెంటనే మహర్షికి అప్పగించిరి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై గొప్ప శిల్పిగామారి ఆ భైరవకోన యందు దేవాలయములను శిల్ప కళానైపుణ్యముతో తీర్చిదిద్దాడని ఒక వార్త ప్రచారములో ఉన్నది. చుట్టు ప్రక్కల కొండలపైకూడ అనేక శివాలయములు కలవు. జలపాతము, జాలువారుచున్న కొండపై అడుగడుగునా శివలింగములు కనుపించును. ఇచట ఆలయములు గుహాలయములు అనగా కొండకు రంధ్రము వేసి ఆలయములు నిర్మింపబడియున్నవి. ఇవి క్రీస్తుశకము 6, 7వ శతాబ్దముల కాలమునాటివని చోళపల్లవ రాజులచే నిర్మింపబడినవని పురాణ గాధలవలన శిల్పము వలనను తెలియచున్నది.
మహాబలిపురములలో గల శిల్పి నైపుణ్యమునకు దీటుగా నిర్మించారని పురాతత్వవేత్తలు అభిప్రాయము ఒకేరాతిలో అష్ట శివాలయములు నిర్మించుట ఇచట ప్రత్యేకత. ఈ శివాలయములలో శివుడు పక్షఘాతేశ్వరుడు, విశ్వేశ్వరుడు, మల్లికార్జునుడు, నగరేశ్వరుడు, భర్గవేశ్వరుడు, భీమేశ్వరుడు, రామేశ్వరుడు శశినాగేశ్వరులను నామములతో భక్తుల పూజలందుకొను చున్నాడు. శివలింగమును గర్భాలయములో ప్రతిష్ఠించి ద్వారము వద్దగల ద్వారపాలకులకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. ఎచటనూ లేనివిధముగా ప్రతి ఆలయము ముందు బ్రహ్మ, విష్ణు నందీశ్వర భృంగీశ్వర విఘ్నేశ్వరుల విగ్రహముల ద్వారపాలకులుగా నుండుట ఇచట విశిష్టత. హరిహరులకు అభేదమును చాటుటకై ఈ త్రిమూర్తుల విగ్రహాములను ఒకే ఆలయమునందు ప్రతిష్ఠించి యుందురని చారిత్రక పరిశోధకులు భావించుచున్నారు. ఇచట క్షేత్రపాలకుడు కాలభైరవస్వామి శివలింగములు అన్నియు చతురస్రాకారములో వుండి శివలింగములకు భస్మత్రిపుండ్రములు అడ్డముగా రేఖలు లేకుండా లింగము మధ్యలో మూడు నిలువు గీతలు మధ్యలో ఒకచుక్క ఇరువైపులా అర్థచంద్రాకారములో రెండు గీతలు కలిగియున్నవి. ఇది భారత దేశంలోని ఏ ఇతర శైవ క్షేత్రములలోనూ కనుపించని సాంప్రదాయము.
ఇచట అమ్మవారు సరస్వతీ లక్ష్మీదుర్గా స్వరూపములతో త్రిముఖములు కలిగి దుర్గాంబ అను పేరుతో కొలువబడు చున్నది. ఈ ఆలయమునకు ఎదురుగా క్షేత్ర పాలకుడైన కాలభైరవస్వామి ఆలయము కలదు. ఇచటనున్న కొండపైన జలపాతము నుండి వచ్చు నీటిని సోనవాన అని పిలిచెదరు. ఇది దుర్గా భైరవుల నడుమ నుండి ప్రవహించుచుండును. ఈ ప్రవాహము వర్షాకాలమున ఉర్దృతరూపము తాల్చిననూ నీరు సుమారు ఆరు అడుగుల ఎత్తునగల శివాలయములోనికి ప్రవేశించును. కానీ మూడు అడుగుల ఎత్తునగల దుర్గాంబా ఆలయమలోనికి ప్రవేశించదు. ఇది నేటికిని కనుపించుచున్న సత్యము.
మాహాత్మ్యములకు నిలయము భైరవకోన దుగ్గమ్మ గుడికి ఎదురుగా గలమట్టిని అమ్మ బంగారమని పిలిచెదరు. ఈ మట్టిని పొలాలకు చల్లుట వలన పంటలు పుష్కలముగా పండునని ఎట్టి చీడ పురుగులు పంటకు వ్యాపించవని గృహ నిర్మాణములో ఉపయోగించినచో ఆ కుటుంబము సర్వతో ముఖముగా వృద్ధి చెందునని దుకాణములలో చల్లినచో వ్యాపారము ద్విగుణీకృతము అగునని విశ్వాసముతో భక్తులు ఈ మట్టిని తీసుకొని పోయెదరు. సంతానార్థులైన భక్తులు ఇచటగల మట్టిచెట్టుకు ఊయలలు కట్టి అమ్మవారిని సంతాన భాగ్యము కలిగించవలసినదిగా ప్రార్ధించినచో కురుణామయి జగన్మాత దుర్గాంబదేవి సంతానమును ప్రసాదించి వారి కోర్కెలను తీరుస్తూ వుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము,
మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారముల వంటి పర్వదినములలో చుట్టుపక్క గ్రామముల నుండి మరియు ఆంధ్రదేశము నలుమూలలనుండి యాత్రీకులు భక్తులు వేనవేలు పరమశివుని అనుగ్రహము కొరకై ఈ దుర్గా భైరవేశ్వరకోన మహాక్షేత్రమునకు వచ్చుచుందురు.
సామాన్యముగ పుణ్యస్థలములు క్షేత్రములు తీర్థములు అని చెప్పబడును. క్షేత్రమనగా కేవలము దైవము మాత్రమే ఆవిర్భవించినచోటు తీర్థమనగా ఆకాశ గంగాజలపాతము కల స్థలము. ఈ బైరవకోన క్షేత్రము తీర్థముగా ప్రసిద్ధి చెందియున్నది. భక్తి జ్ఞానసంపన్నులగు మహనీయులు ఈ దైవమును సందర్శించి దైవానుగ్రహమునకు పాత్రులు కాగలరని కోరుచున్నారము. ఈ దుర్గా భైరవవేశ్వరులను గూర్చి శ్రీ రామకృష్ణశాస్త్రి గారు శ్రీ భైరవేశ్వర సుప్రభాతము రచించి యున్నారు. సాధకులు చదివి ఆనందింపగలరు.
1. శ్రీమత్ భైరవకోన నామ విలసత్ శైలాంతరాళస్ఫురత్ విఖ్యాతాష్ట గుహాంతరాళ సుమహత్ పీఠాంత సంవాసినీ | కావ్యాలాప వినోదినీ భగవతీ కారుణ్యవారాం నిధిః దేవీ భైరవ సుందరీ త్రిముఖ దుర్గాంబా సదా రక్షతు ॥
2. శ్రీవాణీ కరుణాభిశోభిత ప్రకాశం మండలాంతర్గత శ్రీమత్ భైరవకోననామయు విఖ్యాతఅష్టగుహంతరాళ శైవక్షేత్రవిభ్రాజితః॥ శ్రీ ముప్పాళాప్వయ వంశవార్థిశశినం వేంకట నరసరాజాహ్వయం వాణీదేవి సతామణిం త్రిముఖ దుర్గా భైరవేశో వదు |
3. ప్రాతఃకాలసుకీర్తసీయ శుభకృత్ శ్రీ సుప్రభాతాభిధ గ్రంధస్యోచిత ముద్రణవ్యయమదాత్ శ్రీ భైరవస్వామినామ్ | శ్రీ మద్వేంకటనర్సరాజు గృహిణీ శ్రీవాణీ కుటుంబంసదా దతా యుర్థన ధాన్య వంశవిభవం పాయాత్ సదా భైరవః ॥
4. శ్రీమత్ అంబవరం ఇతి ప్రవిలసత్ గ్రామీణ పంచాయతీ అధ్యక్షం శుభ ధర్మకార్య నిరతం సి.యస్.పురం మండలే | భాస్యత్ భైరవకోన క్షేత్ర వివిధౌన్నత్యమాకాంక్షిణం శ్రీ వాణీం వేంకట నరసరాజు అభిధం పాయాత్ సదా భైరవః ॥


