*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి*
చదువుతోనే మంచి భవిష్యత్తు.
కలెక్టర్ MN హరేందిర ప్రసాద్.
చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలక్టరు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన విశాఖ ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజుతో కలసి అక్కయ్యపాలెం ఎన్జీవో కోలనీలో, జివిఎంసి హై స్కూలులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశములో కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువుపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటే బాల్య వివాహ సమస్య ఉత్పన్నం కాదన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలన్నారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగి ఉంటే పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణ అలవాటవుతుందన్నారు. క్రమశిక్షణ పాటించినవారు అన్ని రంగాలలో విజయమంతమవుతారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నారా లోకేష్ చొరవతో మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.0 జరుగుతుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అకాడమిక్ ట్రాక్ తెలుసుకోవడానికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించారని దీనివలన తమ పిల్లల ప్రగతి తెలుసుకో వచ్చన్నారు. ప్రతి తల్లిదండ్రి లీప్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే తమ పిల్లలు ప్రతిరోజు పాటశాలకు వస్తున్నారో లేదో కూడా తెలుసుకోవచ్చన్నారు. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు లీప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం పిల్లలకు నచ్చే విధంగా ప్రభుత్వం పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటిగా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందిస్తున్నామని కలక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న స్కూల్ కిట్స్ సక్రమంగా వినియోగించుకోవలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు ప్రభుత్వం 100 శాతం యాక్షన్ ప్లాన్ ప్రకారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను చదివించాలన్నారు. విద్యార్థినీ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్దికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
విశాఖపట్నం ఉత్తర శాసన సభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని కొంత సమయం కేటాయించాలన్నారు. ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరు గౌరవం ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువు పై దృష్టి పెట్టాలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
తాను పదవ తరగతిలో లెక్కలలో 100 శాతం మార్కులు సాధించాలని, అలాగే ఇంజనీరింగ్ లో రాష్ట్ర స్థాయిలో 34వ ర్యాంకు సాధించానన్నారు అందువల్ల ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాదించాలన్నారు.చదువు శాశ్వత ఆస్తి అని అది జీవితాంతం మన వద్దే ఉంటుందన్నారు.
జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 6 నెలలకొకసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (MPTM) ప్రభుత్వం నిర్వహిస్తున్నాదన్నారు కార్పొరేటర్ డి. శ్రావణి మాట్లాడుతూ ప్రైవేట్ పాటశాలలకు దీటుగా ప్రభుత్వ పాటశాలలలో ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తున్నాదన్నారు.
అంతకుముందు ఎన్ సి సి కేడిట్ ల గౌరవ వందనం స్వీకరించారు. ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడారు. పిల్లల హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు ను కలక్టర్,MLA పరిశీలించారు. ఇటీవల అమరావతిలో జరిగిన అసెంబ్లీ లో మార్షల్ గా వ్యవహరించిన హర్షవర్ధన్ అభినందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
బాల్య వివాహాలు జరగకుండా తమ వంతు కృషి చేస్తామని కార్యక్రమం లో ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రామారావు, హెడ్ మాస్టర్ రాదా కుమారి, స్కూల్ కమిటి చైర్మన్ అప్పలస్వామి, ఎయు మాజీ రిజిష్ట్రార్ ఉమా మహేశ్వర రావు, లయన్స్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


