భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం అంబాజీపేట లో గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారధ్యం పేరుతో రాష్ట్రం అంతా పర్యటించారని, పార్టీని బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని అన్నారు. మండల అధ్యక్షులు, మండల ఇంచార్జి లు పార్టీకి సమయం కేటాయించి గ్రామాలలో తిరిగి పార్టీ ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. రాబోయే కాలంలో మన ఊరు-మన జండా, చేరువ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వెళ్తాం అన్నారు. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం స్కూల్ లో విద్యార్దులకు చూపించే కార్యక్రమం, జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై కలెక్టరేట్ లో జరిగే పీజీఆర్ఎస్ లో పిర్యాదు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామం లో ప్రజలలోకి వెళ్ళి బూత్ కమిటీ లు వెయ్యాలి అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా మాట్లాడుతూ కన్వీనర్ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత మండల ఇంచార్జీలను గ్రామాలలో, బూత్ లలో పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి నియమించిందని అన్నారు. వారు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ మండలాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా నాయకులు మండల అధ్యక్షులతో పర్యటనలు చేసి బూత్ కమిటీలను, శక్తి కేంద్రాలను త్వరితగతన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, కోపనాతి దత్తాత్రేయ, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి, అనకాపల్లి ఇంచార్జి కర్రి చిట్టిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, సీనియర్ నాయకులు ఆర్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


