గోదావరి నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నందున గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) హెచ్చరించారు. నిన్న రాత్రి పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు యువకులు గల్లంతైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు నగర పాలక సంస్థ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, టీడీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు.
ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గోదావరి నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరినీ పుష్కరాల రేవులోనికి అనుమతించవద్దని, ఆ మేరకు రేవు బయట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అలాగే స్నానాలు నిమిత్తం రేవుకు వచ్చే భక్తులను నియంత్రించేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిత్యం పోలీసులు పహారా కాయాలని త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


