విశాఖపట్నం జిల్లా, పద్మనాభం అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి):
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా పద్మనాభంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో మానసిక ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి గ్రేస్ లిల్లీ, హెల్త్ కౌన్సిలర్ ఝాన్సీ, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెల్త్ కౌన్సిలర్ ఝాన్సీ మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థినులు చదువుతో పాటు తమ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పరీక్షలు, చదువు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు.
మానసిక సమస్యలను దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలని, అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలని సూచించారు. సానుకూల ఆలోచనలు, తగిన విశ్రాంతి, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని వివరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గ్రేస్ లిల్లీ మాట్లాడుతూ, విద్యార్థినుల సమగ్ర అభివృద్ధిలో మానసిక ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని మానసిక ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
