రైల్వేకోడూరు:
ధరల పెరుగుదలకి అనుగుణంగా జీతాలు పెంచాల్సిన చోట, కూటమి ప్రభుత్వం పనిగంటలు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం దుర్మార్గమని, ఇది కార్మికులకు జరిగిన పెద్ద ద్రోహమని అన్నమయ్య జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా నాయకులు ఆర్. వెంకటేష్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, రాష్ట్రంలోని టిడిపి–జనసేన–బిజెపి కూటమి యధాతధంగా అమలు చేస్తోందని వారు ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేసి, కనీస చర్చ లేకుండా అసెంబ్లీలో కార్మిక వ్యతిరేక తీర్మానం ఆమోదించారని మండిపడ్డారు. ప్రస్తుత ఎనిమిది గంటల విధానం స్థానంలో 12 గంటలు పనిచేయించుకోవచ్చని చట్టం చేయడమే కాక, ఐదు గంటల పనికి గంటసేపు విరామం, వారానికి 48 గంటల బదులు 60 గంటలు, ఓవర్‌టైమ్‌ను 75 గంటల నుంచి 144 గంటలకు పెంచటం యజమానులకు అనుకూలమైన చర్యలని విమర్శించారు. 64 సంస్థల కనీస వేతనాలను 15 ఏళ్లుగా సవరించని ప్రభుత్వం, ఇప్పుడు కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అంతేకాక, మహిళలను రాత్రి షిఫ్ట్‌లకు అనుమతించడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వారి జీవన పరిస్థితులు, ఆదాయం, వేతనాల పెంపు వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చే జరగకపోవడం కార్మిక వర్గంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందన్నారు. పెట్టుబడిదారుల పార్టీల పట్ల కార్మికులు మోహం వదిలి, పూర్వీకులు పోరాడి సాధించిన హక్కులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, ఓబులవారిపల్లి మండల నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


